logo

బాలికపై అత్యాచారం.. దోషికి యావజ్జీవ కారాగారం

ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి ఓ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.25,000 జరిమానా విధిస్తూ..

Updated : 16 Apr 2024 05:57 IST

మణికంఠ

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి ఓ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.25,000 జరిమానా విధిస్తూ.. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి సోమవారం తీర్పునిచ్చారు. బాధిత బాలికకు రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫార్సు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల గ్రామానికి చెందిన దంతురి మణికంఠ అలియాస్‌ మాణిక్యం (25) మీర్‌పేట ఠాణా పరిధిలోని ఓ కాలనీలో ఉండేవాడు. ఈ క్రమంలో ఓ బాలిక(17)తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్లు నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 2017లో బాలికను అపహరించి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక.. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సమగ్ర దర్యాప్తు తర్వాత నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు ఇతర సెక్షన్ల కింద అభియోగ పత్రం దాఖలు చేశారు.


గురుకులంలో విచారణ

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యుల బృందం సోమవారం విచారణ జరిపారు. గత మూడు రోజుల క్రితం పాఠశాలకు చెందిన విద్యార్థులు కలుషిత ఆహారం భుజించి అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల అస్వస్థతపై నిజానిజాలు తేల్చేందుకు సంస్థ విచారణ కమిటీని నియమించింది. సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి, జాయింట్‌ సెక్రటరీ అనంతలక్ష్మి, విజిలెన్స్‌ అధికారి హుస్సేన్‌, ఓఎస్‌డీ ఉమామహేశ్వరిలు విద్యార్థులు, ప్రిన్సిపల్‌, కేర్‌ టేకర్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను విచారించి నివేదికను రూపొందించినట్లు తెలిసింది. అధికారులు అందించిన నివేదికపై బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. సోమవారం నాటికి అస్వస్థతకు గురైన ఐదుగురు విద్యార్థులు ఇంకా భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఇద్దరు, రెయిన్‌బో ఆస్పత్రిలో ఒకరు, గురుకులంలోని ఓపీడీలో ఇద్దరు, స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో ఒకరు ఇంకా చికిత్స పొందుతున్నట్లు సమాచారం.


నెల రోజుల్లో రూ.19 లక్షలు సీజ్‌

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలించే నగదు, మద్యాన్ని గుర్తిస్తున్నారు. కోడ్‌ అమలులోకి వచ్చిన మార్చి 16వ తేదీ నుంచి సోమవారం జిల్లాలో 19,08,669 నగదు సీజ్‌ చేశారు. 2,402 లీటర్ల మద్యం, 5.58 కిలోల గంజాయి పట్టుబడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని