logo

గురుక్షేత్ర సంగ్రామం

పీఆర్సీ జీవోలను వెంటనే రద్దుచేయాలని, అందరికీ ఆమోదయోగ్యమైనది ప్రకటించాలంటూ ఉద్యోగులు నినదించారు. రివర్స్‌ పీఆర్సీతో ఉద్యోగులు, పింఛనర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు....

Updated : 21 Jan 2022 04:37 IST

పోలీసులకు, టీచర్లకు మధ్య తోపులాట
వేలమంది ఉపాధ్యాయులతో కలెక్టరేట్‌ ముట్టడి
మాయదారి పీఆర్సీ మాకొద్దంటూ మిన్నంటిన నినాదం
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

విశాఖపట్నం కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి నినదిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు

జీతాలు, భత్యాల్లో కోతలు పెట్టే ఈ మాయదారి పీఆర్సీ మాకొద్దంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు గర్జించారు. ఫ్యాప్టో పిలుపు మేరకు గురువారం వేలాది మంది ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కలెక్టరేట్‌కు నలుమూలలా పోలీసు బలగాలు మోహరించి బారికేడ్లు, రోప్‌పార్టీలతో ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అడ్డుకోవాలని ప్రయత్నించగా.. వారి వలయాన్ని ఛేదించి, పోలీసులను తోసుకుంటూ ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ గేటు వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు.

పీఆర్సీ జీవోలను వెంటనే రద్దుచేయాలని, అందరికీ ఆమోదయోగ్యమైనది ప్రకటించాలంటూ ఉద్యోగులు నినదించారు. రివర్స్‌ పీఆర్సీతో ఉద్యోగులు, పింఛనర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసిన నినాదాలతో కలెక్టరేట్‌ కూడలి పరిసరాలు దద్దరిల్లిపోయాయి.

కలెక్టరేట్‌ దారిలో అడ్డుకున్న పోలీసులను దాటుకొని పరుగులు తీస్తున్న ఉపాధ్యాయులు

ముట్టడిలో ఉద్రిక్తత..
పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కలెక్టరేట్‌ ముట్టడి నిమిత్తం ఉపాధ్యాయులు ఉదయమే జడ్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మరికొందరు కేజీహెచ్‌ వైపు వచ్చారు.  కలెక్టరేట్‌ సమీపానికి వీరు రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు కూడా భారీగానే వచ్చారు. అదనపు డీసీపీ ఆధ్వర్యంలో నలుగురు ఏసీపీలు, పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టరేట్‌ లోపలికి వచ్చే వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఆర్డీఓ కిషోర్‌ను సైతం ఆపేశారు. ఓ పోలీసు అధికారి జోక్యం చేసుకోవడంతో ఆర్డీఓ లోపలకు వెళ్లగలిగారు.

* కలెక్టరేట్‌ వైపు వచ్చే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్‌ మళ్లించారు. బారికేడ్లు పెట్టి ఉద్యోగులు కలెక్టరేట్‌ వైపు వెళ్లకుండా మొదటిసారి అడ్డుపడ్డారు. శ్రద్ధా ఆసుపత్రి సమీపంలో మరోసారి రహదారికి అడ్డంగా తాళ్లు కట్టి అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు కిందపడిపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉపాధ్యాయులు అక్కడే బైఠాయించి సుమారు 20 నిమిషాల ప్రతిఘటన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుని కలెక్టరేట్‌ గేటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే కేజీహెచ్‌ మార్గం నుంచి కొంతమంది కలెక్టరేట్‌ గేటువద్దకు చేరుకొని ఆందోళన చేస్తుండటంతో..ఒక్కసారిగా కలెక్టరేట్‌ కూడలి కిక్కిరిసిపోయింది.


రెండున్నర గంటల పాటు ఆందోళన...

ఆర్డీఓ పెంచలకిషోర్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు

దయం 10.30 గంటలకే కలెక్టరేట్‌ వద్దకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేరుకున్నారు. ఫ్యాప్టో జెండాలు, ప్లకార్డులు పట్టుకుని, పీఆర్సీని వ్యతిరేకిస్తూ గేటు ముందు బైఠాయించారు. ఉపాధ్యాయినులు, పెన్షనర్లు, సీపీఎస్‌ ఉద్యోగులు ఎక్కువ మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ చేసిన నినాదాలతో  12.30 గంటల వరకు ఆ ప్రాంతమంతా మార్మోగింది. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలి, గేటు తియ్యండని పోలీసులను కోరినా వారు అంగీకరించలేదు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులంతా గేటును తోసి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుపడటంతో ఇరువర్గాల మధ్య మరోసారి తోపులాట జరిగింది. కలెక్టర్‌ లేకపోవడంతో ఆర్డీవో పెంచల కిశోర్‌ గేటు వద్దకు వచ్చి ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి వినతి స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం ఫ్యాప్టో నేతలు మాట్లాడుతూ ముట్డడిని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలపై అన్ని సంఘాలతో సమావేశమై చర్చిస్తామన్నారు.


ముందస్తు అరెస్టులతో మొదలు..

కలెక్టరేట్‌కు వెళ్లకుండా ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు

పీఆర్సీకి వ్యతిరేకంగా కలెక్టరేట్‌ ముట్టడిస్తామని ఉపాధ్యాయులు ముందే ప్రకటించారు. దీంతో పోలీసులు తెల్లవారుజాము నుంచే జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నేతల్లో కొందరిని ఆందోళనకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నర్సీపట్నంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్‌ను గృహ నిర్బంధం చేశారు. అనకాపల్లిలో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వై.శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు గణేష్‌ కుమార్‌లు ‘మేం అనారోగ్యంతో ఉన్నాం, ఎలాంటి ఆందోళనల్లోను పాల్గొనడం లేద’ని చెప్పినా పోలీసులు ఇంటి దగ్గరే పహారా కాశారు. పాడేరులో ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు అంబిడి శ్యామ్‌సుందర్‌ను, అనకాపల్లిలో ఏపీ సీపీఎస్‌ ఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావును హౌస్‌ అరెస్టులు చేశారు.


జిల్లా పరిషత్‌ కార్యాలయం రోడ్డు నుంచి కలెక్టరేట్‌కు వెళుతూ..

రాష్ట్రస్థాయిలో పీఆర్సీ జేఏసీ సూచనలతో ఆందోళనలకు అంతా సిద్ధం కావాలని ఉద్యోగ, ఉపాధ్యాయులను నేతలు కోరారు. కలెక్టరేట్‌ నుంచి జగదాంబ కూడలి వరకు ఊరేగింపు వెళ్లి అక్కడ మానవ హారంగా ఏర్పడి మరోసారి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎంవి కృష్ణకుమార్‌, ఎ.ధర్మేంద్రరెడ్డి, కె.ఈశ్వర్రావు, కె.శ్యాముల్‌, కె.శ్రీనివాస్‌, బి.రామకృష్ణ, వై.సుధాకరరావు, డి.జోజిబాబు తదితరులు పాల్గొన్నారు.


ఇదెక్కడి తీరు: పీఆర్సీ అంటే ఎక్కడైనా వేతనాలు పెరుగుతాయి. దీనికి విరుద్ధమైన జీఓలను జారీ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు ఆమోదయోగ్యంగా లేనటువంటి పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలను తక్షణమే రద్దు చేయాలి. అప్పటి వరకు ఆందోళనను తీవ్రతరం చేస్తాం.

-టి.రామకృష్ణ, ఏపీటీఎఫ్‌ అధ్యక్షులు


అర్ధరాత్రి జీవోలు మాకొద్దు: ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు తగ్గించడం దారుణం. భత్యాలు తగ్గించడం వల్ల అందరూ తీవ్రంగా నష్టపోతారు. తక్షణమే హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులను యథాతథంగా అమలు చేయాలి. అర్ధరాత్రి జారీ చేసిన జీఓలను తక్షణమే రద్దు చేయాలి.

- సిహెచ్‌.వెంకటేశ్వర్లు, ఫ్యాప్టో రాష్ట్ర నేత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని