logo

ఔషధ నిల్వలపై పర్యవేక్షణ

కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో సరిపడా ఔషధ నిల్వపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు కె.రజిత పేర్కొన్నారు. జలుబు, దగ్గు, జ్వర లక్షణాలకుసాధారణంగా వినియోగించే మందులు

Published : 24 Jan 2022 02:17 IST

ఏడీ రజిత

కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో సరిపడా ఔషధ నిల్వపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు కె.రజిత పేర్కొన్నారు. జలుబు, దగ్గు, జ్వర లక్షణాలకుసాధారణంగా వినియోగించే మందులు దాదాపు అన్ని చోట్లా అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా కొరత లేదన్నారు. పరిస్థితులను ఊహించి చాలాచోట్ల ఫార్మాసిస్టులు ముందస్తుగానే నిల్వలు తెప్పించుకున్నారన్నారు. జిల్లాలో కేసులుఎక్కువవుతున్న నేపథ్యంలో ఔషధాల సరఫరా తదితర అంశాలపై ఆమె ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈనాడు, విశాఖపట్నం: అవసరమైన మందుల నిర్వహణపై నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో డ్రగ్‌ కంట్రోలర్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అజిత్రోమైసిన్‌, పారాసిటమాల్‌, సిట్రిజన్‌, ఐవర్‌మెక్టిన్‌, విటమిన్‌ మాత్రలు వంటి ముప్పై రకాలకు చెందిన లిస్టు పంపారు. అవి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయన్నవి ఎప్పటికప్పుడు తనిఖీ చేసి పంపుతున్నాం. వీటిల్లో ఎటువంటి కొరత లేదు.
ఐదుగురు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో...
ప్రస్తుతం ఔషధాల వినియోగం పెరుగుతోంది. మందుల దుకాణాల్లో అనేక రకాలవి ఉంటున్నాయి. మార్కెట్లోకి కొత్త పేర్లతో పలు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. అవి ఎంత నాణ్యమైనవో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ, ప్రస్తుతం కొవిడ్‌కు వినియోగించే మందులపై నిఘా ఉంచాం. డ్రగ్‌ నాణ్యతను తనిఖీ చేసేందుకు నమూనాలు సేకరిస్తున్నాం. జిల్లాలో అయిదుగురు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపడుతున్నాం. ఒక్కొక్కరు 8 నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీటన్నింటినీ చేపడుతున్నాం. ఎవరెవరు ఏ మందులు తెప్పిస్తున్నారు, నిల్వలు ఎంతున్నాయి, అధిక ధరకు ఏమైనా విక్రయిస్తున్నారా? అన్న అంశాలపై అనకాపల్లి, నర్సీపట్నం, గాజువాక, నగర పరిధిలో ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేస్తారు. మాస్కులు, పీపీఈ కిట్లు సమృద్ధిగా ఉన్నాయి.
బాధితుల్ని గుర్తించేందుకు మాత్రమే...
కొన్ని మందుల దుకాణాల్లో పారాసిటమాల్‌ మాత్రల విక్రయంపై ఆంక్షలు అవాస్తవం. ఈ డ్రగ్‌పై ఎక్కడా ఎటువంటి ఆంక్షలు లేవు. కొవిడ్‌ నేపథ్యంలో దుకాణదారులు ఎవరికి విక్రయిస్తున్నారో వారి వివరాలు తీసుకోమంటున్నాం. ఆ వివరాలను సమీప ఆరోగ్య కేంద్రానికి పంపించి బాధితులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ తీసుకొచ్చారు తప్ప, ఎవరికీ విక్రయించకుండా ఉండకూడదు. డ్రగ్‌ నాణ్యత, అధిక ధరకు విక్రయించడంపై కొవిడ్‌ మొదటి, రెండు దశల్లో పది వరకు కేసులు నమోదు చేశాం. వీటిపై ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తున్నాయి. రెమ్‌డెసెవిర్‌ సూది మందును అధిక ధరకు విక్రయించడం, అనధికారికంగా ఉంచడంపై ఏడు, ఆక్సిజన్‌ సిలిండర్ల అనధికార నిర్వహణ, శానిటైజర్ల నాణ్యత తదితర అంశాలపై నాలుగు కేసులు పెట్టాం.
గత అనుభవాల దృష్ట్యా..
కొవిడ్‌ రెండో దశలో అత్యవసర సమయాల్లో వినియోగించిన ఇంజక్షన్లు, ఇతర మందులకు ప్రస్తుతం డిమాండు లేదు. ఎవరూ కావాలని అడగడం లేదు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎవరు వీటిని తెప్పిస్తున్నారు, ఎవరి వద్ద ఎన్ని ఇంజక్షన్లు ఉన్నాయన్న వివరాల్ని మాత్రం ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాం. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజిలెన్స్‌ టీం ఆధ్వర్యంలో ఇటువంటి వాటిపై ప్రత్యేక నిఘా నిరంతరం ఉంటుంది. ఎవరైనా అధిక ధరలకు విక్రయించినా ఇతర అనైతిక వ్యాపారం సాగించినా ప్రజలు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఫిర్యాదు చేయొచ్చు.నాణ్యత పరిశీలనకు నమూనాల సేకరణ
ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయం, విశాఖపట్నం ఫోన్‌ నంబర్‌ 0891 2552886

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని