logo

వీఎంఆర్‌డీఏ ఆదాయానికి గండి!

కోట్ల రూపాయలతో నిర్మించిన కల్యాణ మండపాలు ఖాళీగా ఉండడంతో వీఎంఆర్‌డీఏ ఆదాయానికి గండి పడుతోంది. పెదగంట్యాడలోని ఓపెన్‌ ఆడిటోరియం, చినముషిడివాడలోని ఆధునిక కల్యాణ మండపం, పిఠాపురం కాలనీలోని షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మాణాలు పూర్తయ్యి ఏళ్లు

Published : 23 May 2022 05:21 IST

ఖాళీగా రూ.కోట్లతో నిర్మించిన కల్యాణ మండపాలు

మరెన్నో దుకాణాలు, ప్లాట్లదీ అదే పరిస్థితి

కోట్ల రూపాయలతో నిర్మించిన కల్యాణ మండపాలు ఖాళీగా ఉండడంతో వీఎంఆర్‌డీఏ ఆదాయానికి గండి పడుతోంది. పెదగంట్యాడలోని ఓపెన్‌ ఆడిటోరియం, చినముషిడివాడలోని ఆధునిక కల్యాణ మండపం, పిఠాపురం కాలనీలోని షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మాణాలు పూర్తయ్యి ఏళ్లు గడుస్తోంది. వీటి ద్వారా వీఎంఆర్‌డీఏకు పైసా ఆదాయం రాకపోగా నిర్వహణ వ్యయం మాత్రం తప్పడం లేదు. గతంలో లీజుకు టెండర్లు పిలిచినప్పటికీ ధర ఎక్కువగా ఉన్నందున ఎవరూ ముందుకు రాలేదు.

ఈనాడు, విశాఖపట్నం: పెదగంట్యాడలోని ఓపెన్‌ ఆడిటోరియాన్ని గత కొన్నేళ్లుగా వేలానికి ఉంచుతున్నా, ఎవరూ తీసుకోవడం లేదు. రెండంతస్థుల్లో కలిపి 7383 చదరపు అడుగుల్లో నిర్మించిన ఆడిటోరియం నిరుపయోగంగా పడుంది. గత నెల 4న రూ.28 లక్షల ప్రాథమిక ధరతో దీనికి వేలం పాట నిర్వహించారు. కనీసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అంతకుముందు జనవరిలో పిలిచినా స్పందన కరవైంది. మూడేళ్లుగా ఇదే తంతు. రెండేళ్ల కిందట ధర తగ్గించి పిలిచినా ప్రయోజనం లేదు. అధికారులు మాత్రం ఎందుకు స్పందన ఉండడం లేదనేది విశ్లేషించడం లేదు. అసలు అక్కడ అంత డిమాండు ఉందా? గుత్తేదారులు ఎవరైనా రింగవుతున్నారా? లేకుంటే అక్కడి మార్కెట్‌ పరిస్థితులకు వీలుగా ఎంత ధర నిర్ణయిస్తే బాగుంటుందనేది ఆలోచించడం లేదు.

చినముషిడివాడలోని కల్యాణ మండపాన్ని రూ.7 కోట్లతో నిర్మించారు. సెంట్రలైజ్డ్‌ ఏసీతో ఆధునిక వసతులతో అందుబాటులోకి వచ్చినప్పటికీ గత నెలలో పిలిచిన వేలం పాటకి స్పందన రాలేదు. దీనికి రూ.85 లక్షల వరకు అప్‌సెట్‌ ధర నిర్ణయించారు. తగిన ప్రాచుర్యం కల్పించి దాని ప్రాధాన్యం తెలియజేస్తే మంచి డిమాండ్‌ ఏర్పడుతుంది. అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు.

నగరం నడిబొడ్డున పిఠాపురం కాలనీలోని షాపింగ్‌ కాంప్లెక్సు కొన్నేళ్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. కేవలం అధికారుల ఉదాసీనత వల్ల రూ.కోట్ల ఆదాయం కోల్పోయింది. ఇందులో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ నిర్ణయం ఉపసంహరించుకోవడంతో ఎటూ కానట్లుగా దీని పరిస్థితి అయిపోయింది. విలువైన భవనం ఖాళీగా ఉండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

మిగులు ప్లాట్ల విషయంలో..

వివిధ ప్రాంతాల్లో మిగిలిపోయిన ఓపెన్‌ ప్లాట్లకు అక్కడ వాస్తవ ధర మరచి ఎక్కువ ధర పెట్టడంతో వేలంలో స్పందన కరవవుతోంది. ఏదో వేలం నిర్వహించామని చేతులు దులుపుకొంటున్నారు తప్ప వాటిని ఎలా విక్రయించాలనే దానిపై కసరత్తు కనిపించడం లేదు. కొన్నేళ్లుగా పలు ప్రాంతాల్లో 50 వరకు ప్లాట్లు మిగిలిపోగా, గత ఏడాది నిర్వహించిన వేలంలో వాటిల్లో పది మాత్రమే వెళ్లాయి. గత నెల వేలంలో కేవలం నాలుగు మాత్రమే అమ్ముడయ్యాయి. వీటి విషయంలో ఒక పూర్తిస్థాయి కసరత్తు లేకపోవడంతో ఏళ్లుగా అవి మిగిలిపోతున్నాయి.  

డబ్బులు కట్టించుకొని..

ఏళ్లుగా వీఎంఆర్‌డీఏకు చెందిన దుకాణాల్లో ఉంటున్న వారిని తొలగిస్తామని చెప్పిన అధికారులు వారి కొనసాగింపునకు రుసుములు వసూలు చేసినప్పటికీ దుకాణాలు అప్పగించడం లేదు. కొద్ది నెలల కిందట బినామీలు నిర్వహిస్తున్న దుకాణాల లీజు రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తరువాత లీజు క్రమబద్ధీకరణ నిబంధన కింద 45 దుకాణాల నుంచి 12 నెలల అద్దె అపరాధ రుసుముగా వసూలు చేశారు. దీంతో కొందరు చెల్లించినా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారు. కనీసం కొత్త అద్దె ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత కరవవుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని