logo

vizag news : ఉక్కు ఉక్కిరిబిక్కిరి

పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం, ముడిసరకు ధరల పెరుగుదలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం తాజాగా రూపాయి పతనం కారణంగా కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. కర్మాగారానికి అవసరమైన కోకింగ్‌ కోల్‌ను ఆస్ట్రేలియా

Updated : 08 Aug 2022 09:01 IST

 రూపాయి పతనంతో పెరగనున్న ఆర్థిక భారం
 నానాటికీ ముదురుతున్న బొగ్గు సంక్షోభం
 పడిపోతున్న ఉత్పత్తి
ఈనాడు, విశాఖపట్నం

పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం, ముడిసరకు ధరల పెరుగుదలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం తాజాగా రూపాయి పతనం కారణంగా కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. కర్మాగారానికి అవసరమైన కోకింగ్‌ కోల్‌ను ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటారు. ప్రతిఏటా 50లక్షల టన్నుల వరకు కోకింగ్‌, పల్వరైజ్డ్‌ కోల్‌ను సంస్థ దిగుమతి చేసుకుంటుంది. మూడేళ్ల కిందట ఒక డాలర్‌ విలువ సుమారు రూ.68లు ఉండగా అది క్రమంగా రూ.80 సమీపానికి చేరడంతో విశాఖ ఉక్కుపై అదనపు భారం పడుతోంది. ఆస్ట్రేలియాలో కోకింగ్‌ కోల్‌ ధరలు కూడా ఇటీవలికాలంలో పెరగడంతోపాటు రూపాయి పతనం కూడా దానికి తోడవడంతో సంస్థపై పడే ఆర్థిక భారం భారీగా ఉంటోంది.
రూపాయి పతనం కారణంగా పడే ప్రభావాన్ని తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో అధికారులు ఒకింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సివస్తోంది.
బొగ్గు కొరతకు అద్దంపట్టిన సీఎండీ వ్యాఖ్యలు
‘నా పని సమయంలో సగకాలం పాటు కర్మాగారానికి అవసరమైన బొగ్గును ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపైనే ఆలోచించాల్సి వస్తోంద’ని సంస్థ సీఎండీ అతుల్‌భట్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి సంస్థను బొగ్గు కొరత ఎంతగా వేధిస్తోందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగితే రోజుకు సుమారు 15వేల టన్నుల కోకింగ్‌ కోల్‌ అవసరం అవుతుంది. ఒకప్పుడు రోజుకు 20వేల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసిన అధికారులు ఇటీవలి కాలంలో పలు రకాల కారణాలు చూపుతూ ఉత్పత్తిని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు పదివేల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది.
రైల్వేరేక్‌లకూ కొరతే....
సంస్థకు అవసరమైన విద్యుత్తు తయారీకి వీలుగా అత్యధిక బాయిలర్‌ కోల్‌ను తాల్చేరు(మాహానది కోల్‌ఫీల్డ్స్‌) నుంచి తీసుకువస్తారు. వేసవి సమయంలో అక్కడి బొగ్గును దేశంలోని థర్మల్‌ విద్యుత్తు కర్మాగారాలకే రైల్వేలు రవాణా చేయడంతో దాని ప్రభావం ఉక్కుపై తీవ్రంగా పడింది. ప్రతి నెలా సుమారు 40 నుంచి 45 వరకు రావాల్సిన రైల్వే రేక్‌లు జూన్‌ నెలలో ఒక్కటీ రాలేదు. గత ఎనిమిది నెలలుగా రైల్వేరేక్‌లకు కూడా సంస్థ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నిధుల కొరతతో సతమతం
నిధుల కొరత కారణంగా కూడా సంస్థ తీవ్రంగా సతమతం అవుతోంది. సంస్థ ఆర్జించిన లాభాలన్నీ పెరిగిన బొగ్గు ధరల కారణంగా హరించుకుపోయాయి. ప్రస్తుతం తగినన్ని నిధులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. సంస్థ అవసరాలకు వీలుగా నిధులు సమకూర్చుకోవడానికి పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. నిధుల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని సీఎండీ వ్యాఖ్యానించడం తీవ్రతకు నిదర్శనం.
ఉత్పత్తిని తగ్గించుకుంటే దీర్ఘకాలంలో తీవ్ర నష్టాలు
రూపాయి పతనం, పెరిగిన కోకింగ్‌ కోల్‌ ధరలు, రైల్వే రేక్‌లు అందుబాటులో లేకపోవడం తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఉక్కు ఉత్పత్తిని తగ్గించేస్తున్నారు. ఫలితంగా ఉక్కు ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ఇదే విధానం కొనసాగిస్తే మాత్రం విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయాలు గణనీయంగా తగ్గి తీవ్రమైన ఆర్థిక నష్టాలను మూటకట్టుకోవాల్సిన పెనుముప్పు పొంచి ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సెయిల్‌లో విలీనమే తక్షణ పరిష్కారం
సెయిల్‌లో విలీనంగానీ, సంస్థకు కనీసం రూ.10వేల కోట్ల ఆర్థిక సాయంగానీ చేయాలని ఉక్కు అధికారుల సంఘం అధ్యక్షుడు కాటం ఎస్‌.ఎస్‌.చంద్రరావు, ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్‌ తెలిపారు. గతంలో ప్రధానులుగా విధులు నిర్వర్తించిన వాజ్‌పేయీ, పి.వి.నరసింహారావులు చేసినట్లు ఆర్థిక సాయం చేయాలన్నారు. ఆ మొత్తాల్ని కర్మాగారం సంక్షోభం నుంచి బయటపడిన తరువాత మళ్లీ తిరిగి తీర్చగలదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు