logo

గెడ్డపాలెం టు వెండితెర

ప్రస్తుత సమాజంలో జనాలపై సినిమాల ప్రభావం ఎక్కువ. దీంతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఓ వెలుగు వెలగాలని అందరూ కలలు కంటారు. కొద్దిమంది మాత్రమే అక్కడున్న ప్రతికూల పరిస్థితులకు తట్టుకుంటారు.

Published : 25 Sep 2022 06:38 IST

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న యువకుడు

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే


దర్శకుడు రాంగోపాల్‌ వర్మతో..

ప్రస్తుత సమాజంలో జనాలపై సినిమాల ప్రభావం ఎక్కువ. దీంతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఓ వెలుగు వెలగాలని అందరూ కలలు కంటారు. కొద్దిమంది మాత్రమే అక్కడున్న ప్రతికూల పరిస్థితులకు తట్టుకుంటారు. అవకాశాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ చిన్నచిన్న పాత్రలే దొరికినా నటనలో ప్రతిభ చూపుతుంటారు. అలా అందరి దృష్టిని ఆకరిస్తూ.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నిలదొక్కుకుంటున్నాడు కర్రి నానాజీ. ఎస్‌.రాయవరం మండలం గెడ్డపాలెంనకు చెందిన ఇతడు పదేళ్లుగా సినిమా పరిశ్రమలో పలు విభాగాల్లో పనిచేస్తున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు.
కర్రి రమణ, అమ్మాజీ దంపతుల రెండో కుమారుడు నానాజీ. తండ్రి వ్యవసాయ కూలీ, తల్లి గృహిణి. నానాజీ 2009లో కోడిగుడ్ల పరిశ్రమలో పనిచేసేందుకు హైదరాబాద్‌ వెళ్లాడు. కొన్ని నెలల పనిచేసిన తరువాత సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా కోడిగుడ్ల పరిశ్రమలో ఉద్యోగం మానేశాడు. కృష్ణానగర్‌ వెళ్లి అక్కడ ప్రొడక్షన్‌ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ సినిమా అవకాశాలు కోసం ఎదురుచూసేవాడు. సినిమా షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి అక్కడున్న వారితో మాట్లాడేవాడు. అలా కొందరితో పరిచయాలు పెంచుకున్నాడు. 2012లో వచ్చిన పవనిజం సినిమాలో మొదటిసారి అవకాశం వచ్చింది. ఆ తర్వాత పలువురు ఆరిస్టులకు అసిస్టెంట్‌గా పనిచేసేవాడు.

నానాజీ ఇప్పటి వరకు శమంతకమణి, పాగల్‌, ఏబీసీడీ, ఉండిపోరాదే, మెరిసే మెరిసే, సూపర్‌ ఓవర్‌ తదితర సినిమాల్లో నటించాడు. ఓ ఛానల్‌లో వస్తున్న వెబ్‌ సీˆరిస్‌లో సీనియర్‌ నటులు రాధికా శరత్‌ కుమార్‌, సాయికుమార్‌తో కలిసి నటిస్తున్నాడు. ప్రస్తుతం విక్కీ ది రాక్‌స్టార్‌, బుట్టబొమ్మతో పాటు అయిదు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు 15 సినిమాల్లో నటించానని, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నది లక్ష్యమని నానాజీ చెబుతున్నాడు.


సూపర్‌ ఓవర్‌ సినిమాలో నానాజీపై చిత్రీకరణ

మళ్లీ రావాతో ఆర్టిస్టుగా గుర్తింపు :  గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో 2017లో వచ్చిన మళ్లీ రావా సినిమాలో టెన్త్‌ ఫెయిల్‌ బుజ్జి క్యారెక్టర్‌తో నానాజీ గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో నానాజీ నటన చూసి పరిశ్రమలోని పలువురు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ మజిలీ సినిమాలో అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో అవకాశాలు పొందుతూ క్యారెక్టర్‌ అర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని