logo

ఏఎంసీలో వసతుల మెరుగుదలకు ప్రణాళిక

ఆంధ్ర వైద్య కళాశాలలో (ఏఎంసీ)ని 27 విభాగాల్లో 135 పీజీ సీట్లను పెంచాలని ఇటీవల ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చి, కీలక వైద్య పరికరాలను సమకూర్చి పీజీ సీట్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 26 Sep 2022 05:22 IST
రూ.157 కోట్లు అవసరమని ప్రతిపాదన
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

పీజీ వసతి గృహాలు నిర్మించేందుకు ఎంపిక చేసిన స్థలం

ఆంధ్ర వైద్య కళాశాలలో (ఏఎంసీ)ని 27 విభాగాల్లో 135 పీజీ సీట్లను పెంచాలని ఇటీవల ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చి, కీలక వైద్య పరికరాలను సమకూర్చి పీజీ సీట్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వందేళ్ల చరిత్ర ఉన్న ఏఎంసీ కూడా ఉంది. ఇక్కడ పీజీ సీట్ల సంఖ్య పెంపునకు తగ్గట్టుగా వసతులు, వసతి గృహాల నిర్మాణం, కీలక వైద్య పరికరాల సమీకరణకు రూ.157.14 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు.

* ప్రస్తుతం పీజీ, డిప్లమో సీట్లు కలిపి 265 వరకు ఉన్నాయి. తాజాగా ప్రతిపాదించిన పీజీ సీట్లు మంజూరైతే ఆ సంఖ్య 400కు చేరనున్నది. అంతకు ముందు మౌలిక వసతులు, కీలకమైన వైద్య పరికరాలు అందుబాటులోకి రావాలి. ఈ మేరకు ఇటీవల ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విభాగాల వారీ లెక్కలు రూపొందించి ఏఎంసీ, ఏపీఎంఎస్‌ఐడీసీలు సంయుక్తంగా ప్రతిపాదనలు పంపాయి. ఆయా లెక్కల ప్రకారం రూ.157.14 కోట్లు అవసరమని తేల్చారు. ఆయా నిధుల్లో కొంత మొత్తం కేంద్రం ఇవ్వనున్నది. మొత్తం నిధుల్లో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.75.37 కోట్లు అవసరమని అంచనా వేశారు. సీటీస్కాన్లు, ఎంఆర్‌ఐ స్కాన్లు, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ యంత్రాలు, కలర్‌ డాప్లర్లు, ఎకో మిషన్లు, సర్జికల్‌ పరికరాలు, రోగ నిర్ధారణ పరికరాలు, పెథాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ తదితర విభాగాలకు పరికరాలు కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు.

* ఇక మౌలిక వసతుల కల్పనకు రూ.81.77 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నిధులతో పీజీలకు వసతి గృహాలు, ప్రస్తుతం ఉన్న వసతిగృహాల్లో సదుపాయాల కల్పన, సీఎస్‌ఆర్‌ బ్లాక్‌, సూపర్‌స్పెషాల్టీ బ్లాకుల్లో అదనంగా మరో అంతస్తు నిర్మాణం, కొత్తగా సమకూరే భవనాల్లో సమావేశమందిరాలు, లెక్చర్‌ హాళ్లు, ప్రస్తుతం ఉన్న ఆపరేషన్‌ థియేటర్లలో వసతులు మెరుగుపర్చడం, కొత్తగా మరికొన్ని ఏర్పాటు చేయడం తదితరాలను ప్రతిపాదించారు. జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసి) మార్గదర్శకాలకు లోబడి ఆయా వసతులను కల్పించాల్సి ఉంది. పందిమెట్ట ప్రాంతంలో ఏఎంసీ విద్యార్థి వసతిగృహం, క్రీడా మైదానం ఉన్నాయి. క్రీడా మైదానంలో పీజీలకు వసతి కల్పించేందుకు బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని ప్రతిపాదించారు. ఏపీఎంఎస్‌ఐడీసీ(ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ) ద్వారా ఆయా పనులు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని