logo

శ్రీనృసింహ దీక్ష.. అప్పన్న స్వామి రక్ష..

మార్గశిర శుద్ధ విదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనృసింహ దీక్షలకు శుక్రవారం సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు.

Published : 26 Nov 2022 02:32 IST

భక్తులకు మాలధారణ చేస్తున్న అర్చకులు

సింహాచలం, న్యూస్‌టుడే: మార్గశిర శుద్ధ విదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనృసింహ దీక్షలకు శుక్రవారం సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. తొలి విడతగా చేపట్టిన మండల దీక్షలో భాగంగా వందలాది మంది భక్తులు మాలధారణ చేశారు. సింహగిరిపై వేడుకగా జరిగిన దీక్షధారణ కార్యక్రమంలో తొలుత అర్చకులు ఆలయంలో స్వామి చెంతన తులసి మాలలు, పూజా ద్రవ్యాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాదస్వర మంగళవాయిద్యాల నడుమ ఆలయ బేడామండపం ప్రదక్షిణం చేసి రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, అర్చకులు కరి సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేదికపై స్వామి, అమ్మవార్ల చిత్రపటాలను ఉంచి విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపారు. అష్టోత్తర శతనామార్చన చేశారు. నాదస్వర మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ అర్చకులు దీక్షాధారులకు మాలధారణ చేశారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి దీక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ మాట్లాడుతూ నియమ నిష్టలతో దీక్షలు పూర్తి చేయాలని భక్తులకు సూచించారు. ఏఈవో నరసింహరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్టీ గంట్ల శ్రీనుబాబు, ఇంఛార్జి ఈఈ బి.రాంబాబు, పలు పీఠాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని