logo

కోలుకుంటున్న క్షతగాత్రులు

పాతభవనం కుప్పకూలిన ఘటనలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య స్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ తెలిపారు.

Updated : 24 Mar 2023 06:36 IST

క్షతగాత్రుల ఆరోగ్య స్థితి తెలుసుకుంటున్న ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ అశోక్‌కుమార్‌, బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు గొండు సీతారామ్‌ తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పాతభవనం కుప్పకూలిన ఘటనలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య స్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ తెలిపారు. ఈ ఘటన జరిగాక గురువారం తెల్లవారు జామున అయిదుగురు క్షతగాత్రులను ఆసుపత్రి అత్యవసర విభాగానికి తెచ్చారన్నారు. ప్రాథమిక చికిత్స అందించి ఐసొలేషన్‌ వార్డుకు తరలించినట్లు చెప్పారు. వీరిలో బి.కళ్యాణికి తలపై బలమైన గాయం తగలడం వల్ల న్యూరోసర్జరీ వార్డుకు తరలించామని, ప్రాణాపాయం లేకున్నప్పటికీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎస్‌.రామారావు , పి.రోజారాణి , ఎస్‌.కృష్ణ , కె.చిట్టిశివశంకర్‌లను జనరల్‌ సర్జరీ వార్డులో చేర్చామని, వారంతా కోలుకుంటున్నారని చెప్పారు.

శవాగారంలో మృతదేహాలు: ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అంజలి, దుర్గాప్రసాద్‌ , చోటూ మృతదేహాలను శవపరీక్షల కోసం మార్చురీలో ఉంచారు. అంజలి, దుర్గాప్రసాద్‌ తల్లిదండ్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. చోటూది బిహార్‌. అక్కడి నుంచి సంబంధీకులు రావాల్సి ఉన్నందున శుక్రవారం శవపరీక్షలు జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక: విశాఖ ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ గురువారం తెల్లవారుజామునే దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలను సమన్వయపర్చి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై విపత్తుల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్‌ మల్లికార్జున నివేదిక పంపారు. క్షతగాత్రులకు పరిహారం విషయమై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.

జీవీఎంసీ కమిషనర్‌ ఆరా: అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు గురువారం ఉదయం పరామర్శించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులు, మృతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యాధికారులకు సూచించారు.
*  క్షతగాత్రులను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు గొండు సీతారాం పరామర్శించారు. బాధితులకు మెరుగైన సేవలందించాలని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ అశోక్‌కుమార్‌కు సూచించారు.
*   సంఘటనపై మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకొని సంబంధిత బాధ్యులుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రమణమూర్తి తెలిపారు.
*   భవనయజమానులుగా పేర్కొంటున్న ఆదినారాయణ, రామకృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

సింధియా, న్యూస్‌టుడే : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్యహత్యకు పాల్పడిన ఘటనపై గురువారం మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు... స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న విశాల్‌ (21) ఉపాధి నిమిత్తం ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఇంటర్వ్యూలో విఫలం కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో గురువారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదుతో మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ బి.లూథర్‌బాబు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని