logo

ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి... ప్రమాదంలో చిక్కుకుని...

ఆధ్యాత్మిక యాత్రను ముగించుకొని కోరమాండల్‌ రైలులో స్వస్థలానికి వస్తున్న సమయంలో ప్రమాదంలో చిక్కుకున్నామని పాతనగరం జాలారిపేట, వాడవీధికి చెందిన ఎం.సత్యం తెలిపారు.

Published : 05 Jun 2023 03:51 IST

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

ప్రయాణ ఖర్చుల కింద రూ.30వేల చెక్కును సత్యంకు అందజేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్రంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, కలెక్టర్‌ మల్లికార్జున తదితరులు

ఆధ్యాత్మిక యాత్రను ముగించుకొని కోరమాండల్‌ రైలులో స్వస్థలానికి వస్తున్న సమయంలో ప్రమాదంలో చిక్కుకున్నామని పాతనగరం జాలారిపేట, వాడవీధికి చెందిన ఎం.సత్యం తెలిపారు. ఆదివారం నగరానికి వచ్చిన ఆయనకు ఉదయం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు రూ.30వేల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో సత్యం మాట్లాడుతూ ప్రమాద అనుభవాలను తెలియజేస్తూ చలించిపోయారు. ‘గత నెల 28న నేను, భార్య పద్మావతి, మరో అయిదుగురం కలిసి వారణాసి వెళ్లాం. యాత్ర ముగించుకొని జూన్‌ 1వ తేదీన కోల్‌కతా చేరాం. కోల్‌కతాలోని వివిధ ప్రాంతాలను సందర్శించిన తర్వాత మరపురాని జ్ఞాపకాలతో 2న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖకు తిరుగు ప్రయాణమయ్యాం. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా బెర్త్‌లపై నుంచి కింద పడిపోయాం. మాపై అనేక మంది పడిపోయారు. ఊపిరి ఆగిపోతున్నట్లనిపించింది. బతుకుతామని అనుకోలేదు. మా బృందంలో వచ్చిన రాజు, మరికొందరు మమ్మల్ని పైకి లేపారు. నా భార్య పద్మావతి వీపుపై బలమైన గాయమైంది. మరో ఇద్దరు గాయపడ్డారు. నా కాళ్లు, చేతులకు దెబ్బలు తగిలాయి. బోగీ నుంచి బయటపడిన తర్వాత డాక్టర్‌ పంకజ్‌ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. డాక్టర్‌ పంకజ్‌ రాత్రంతా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. ఆహారం కూడా అందించారు. ఆయన చేసిన సహాయం మరువలేం. 3న ఆసుపత్రిలో ఉండాలని సూచించినప్పటికీ ప్రత్యేకంగా వాహనం మాట్లాడుకొని విశాఖ వచ్చేశాం. రవాణా ఛార్జీల కింద ప్రభుత్వ రూ.30వేలు చెల్లించింద’ని సత్యం తెలిపారు.


క్షతగాత్రులకు కేజీహెచ్‌లో చికిత్స

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న భారతి, మాధవరావు

కోరమాండల్‌ రైలు ప్రమాదంలో గాయపడ్డ శ్రీకాకుళానికి చెందిన ఎ.శంకరరావు (29)ను ఆదివారం ఉదయం ఉన్నత చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. అతన్ని ఆర్థోపెడిక్‌ వార్డులో చేర్చామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ డి.రాధాకృష్ణ తెలిపారు. సీటీస్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌, ఎక్స్‌రేతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేశామని, తేలికపాటి గాయాలు ఉండడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరో ఇద్దరు బాధితులను ఆదివారం రాత్రి కేజీహెచ్‌లో చేర్పించారు. బుచ్చిరాజుపాలేనికి చెందిన భారతి, మాధవరావు వెన్నెముక నొప్పితో బాధపడుతూ వచ్చారు. వారికి క్యాజువాల్టీలో అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. భువనేశ్వర్‌ నుంచి పూజ అనే మహిళను అంబులెన్సులో నగరానికి తరలిస్తున్నారని, ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్పిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు తెలిపారు. మరో బాధితురాలు కె.అరుణను రోడ్డు మార్గంలో తీసుకొస్తున్నారని, ఆమెను హెల్త్‌సిటీలోని క్యూ1 ఆసుపత్రిలో చేర్చనున్నట్లు చెప్పారు.

క్షతగాత్రుడు శంకరరావు ఆరోగ్యస్థితిని పరిశీలిస్తున్న డాక్టర్‌ రాధాకృష్ణ

అంబులెన్సులో పూజను తీసుకొచ్చిన దృశ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని