logo

కూలిన కాల్వలు.. దెబ్బతిన్న రోడ్లు!

కూలిన మురుగు కాల్వలు.. దెబ్బతిన్న సీసీ రోడ్లు.. పనిచేయని బోరు మోటార్లతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 02 Feb 2023 05:38 IST

కాలనీలో మురుగు కాలువలు లేక నిలిచిపోయిన మురుగునీరు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: కూలిన మురుగు కాల్వలు.. దెబ్బతిన్న సీసీ రోడ్లు.. పనిచేయని బోరు మోటార్లతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. మిషన్‌ భగీరథ పైపులైన్‌ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధాన రహదారి పక్కన తాగునీటి పైపులు పగిలిపోవటంతో తాగునీరు అప్పుడప్పుడు లీకేజీ అవుతున్నందున కాలనీ వాసులకు పూర్తి స్థాయిలో సరఫరా కావడం లేదు. కాలనీకి అతి సమీపంలో ఉపరితల గనితో పాటు కేటికే 6వ భూడర్భ గని తవ్వకాలు కొనసాగడంతో తాగునీటి బోర్లలో నీరు పూర్తిగా ఎండిపోయింది.
కాలనీ ముఖ్య కూడలి ప్రాంతంలో మురుగు కాల్వలు లేకపోవడంతో మురుగు, చెత్తచెదారం పేరుకుపోయి దుర్వాసనతో సతమతమవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు. దీంతో దోమలు, పందుల బెడద కారణంగా స్థానికులు రోగాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. కాలనీలో సుమారు 23 కుటుంబాల వరకు పూరి గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లి, భాస్కర్‌గడ్డ ప్రాంతాల్లో నిర్మించిన రెండు పడుకగదుల ఇళ్లను కాలనీలోని అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్‌ కృష్ణమోహన్‌ కాలనీలో ఇంటింటా పరిశీలించి, కాలనీవాసుల సమస్యలు తెలుసుకుని, అదే రోజు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఐదేళ్లు గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. కాలనీలోనే చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే నివాసం ఉంటున్నారు.

మురుగు కాలువలే ప్రధాన సమస్య
- ఎండి.సయ్యద్‌ హుసేన్‌, కాలనీ వాసుడు

కాలనీలో మురుగు కాల్వల్లో మురుగు పేరుకపోయి దుర్వాసన వస్తోంది. దీంతో దోమలు, పందుల బెడద కారణంగా జనాలు రోగాల బారిన పడుతున్నా పాలకులు, సంబంధిత అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. చాలా చోట్ల మురుగు కాల్వలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.

సీసీ రోడ్లు నిర్మించాలి..
- బండారి రమేష్‌, కాలనీ వాసుడు

కాలనీలో సీసీ రోడ్లు పూర్తిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలనీకి అతి సమీపంలోనే పాత ఎర్రచెరువు శిఖం భూములు ఉన్నందున వర్షాకాలంలో కాలనీలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయి. కాలనీలో తాగునీటి సమస్య కూడా ఉంది. రెండు రోజులకు ఒకసారి నల్లా నీరు రావడంతో ప్రజలకు నీరు సరిపోవటం లేదు. అదనంగా రెండు చేతిపంపులు ఏర్పాటు చేయాలి. వేసవిలో కాలనీ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.

సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తాం
- అవినాష్‌, మున్సిపాలిటీ కమిషనర్‌

కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తాం. ప్రధానంగా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా కొద్ది రోజుల క్రితమే తాగునీటి బోర్‌ మరమ్మతు చేయించి, కొత్త పైపులైన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మురుగు కాల్వల్లో చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. నిధులు విడుదల కాగానే అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లను నిర్మిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని