logo

జిల్లాలో గంజాయి మాఫియా!!

నిషేధిత గంజాయి, గుడుంబా బెల్లం మానుకోటకు భారీగా చేరుకుంటోంది. నిఘా పెట్టి కట్టడి చేస్తున్న యంత్రాగానికి స్మగ్లర్లు సవాల్‌ విసురుతున్నారు.

Updated : 29 May 2023 04:57 IST

యువతే లక్ష్యంగా విక్రయాలు.. ఇతర ప్రాంతాలకు రవాణా

ఇటీవల నెల్లికుదురు ఠాణా పరిధిలో అధికారులు పట్టుకున్న 150 కిలోల గంజాయి

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, నెహ్రూసెంటర్‌: నిషేధిత గంజాయి, గుడుంబా బెల్లం మానుకోటకు భారీగా చేరుకుంటోంది. నిఘా పెట్టి కట్టడి చేస్తున్న యంత్రాగానికి స్మగ్లర్లు సవాల్‌ విసురుతున్నారు. పోలీసులు పట్టుకుంటున్నది కొద్దిగా ఉంటున్నా.. పెద్ద మొత్తంలో చేరాల్సిన చోటికి చేరుతున్నట్లు సమాచారం. పట్టణాల్లో, మండల కేంద్రాల్లోనూ యువతే లక్ష్యంగా విక్రయాలు కూడా చేపడతున్నట్లు వినికిడి. ఈ నెల 11న మహబూబాబాద్‌, నెల్లికుదురు మండలాలకు చెందిన ముగ్గురు యువకులు వ్యవసాయ పొలం వద్ద భద్రపరిచిన 150 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా నెల్లికుదురు పోలీసులు పట్టుకున్నారు. తాజాగా తొర్రూరులో ద్విచక్ర వాహనంపై రెండు కిలోల గంజాయిని తరలిస్తున్న యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇక్కడే కాకుండా వివిధ జిల్లాల పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనూ గంజాయి స్మగ్లర్లు పట్టుబడితే అందులోనూ జిల్లాకు చెందిన వారే ఉంటుండడం గమానర్హం. కాగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి భారీగా దిగుమతి చేసుకొని అమ్మకాలు చేయడంతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అడ్డుకట్టు వేయడానికి పోలీసులకు ఒక పరీక్షగా మారింది.


సిగరెట్లు విక్రయం

మత్తు కలిగించే ఈ గంజాయిని మహబూబాబాద్‌, తొర్రూరు, కురవి, డోర్నకల్‌, మరిపెడ, నర్సింహులపేట ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ రూపకంగానే కాకుండా మహబూబాబాద్‌ పట్టణంలో సిగరెట్లలోనూ గంజాయిని పెట్టి అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. రూ.250కి ఒక్కటి చొప్పున..తొర్రూరు పట్టణ ప్రాంతంలోనూ రూ.50 నుంచి రూ. 150 చొప్పున ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు వినికిడి. ఈ దందా అంతా శివారు ప్రాంతాల్లోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సుమారు నెల రోజుల కిందట మానుకోటలో ఓ యువకుడు గంజాయి సిగిరెట్‌ తాగి తాను ఉంటున్న కాలనీల్లో హంగామా సృష్టించడంతో ఆ ప్రాంతవాసులు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. ఈ విషయంలో బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు.


ఎక్కడి నుంచి వస్తుందంటే

జిల్లాకు చెందిన గంజాయి రవాణాదారులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చింతూరు, సీలేరుతో పాటు రాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో తెచ్చి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు కార్లు, ఆటో, ట్రాక్టర్ల ద్వారా తెచ్చిన వారు ప్రస్తుతం ద్విచక్ర వాహనాల ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా జిల్లాలోకి చేర్చుతున్నట్లు తెలిసింది. మరిపెడ ప్రాంతం నుంచి ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఆ సరకును పొలాలు, అటవీ ప్రాంతాలున్న చోట్ల భద్రపరిచి ఫోన్ల ద్వారా ఆర్డర్లు తీసుకొని రాష్ట్ర రాజధాని ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లు తెలిసింది.


అనర్థాలపై అవగాహన కల్పిస్తూ..

గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న పట్టుబడుతున్న వారిలో ఎక్కువ శాతం యువతనే ఉంటుంది. పోలీసులు పాత నేరగాళ్లను గుర్తించి మరోసారి గంజాయి క్రయవిక్రయాలు చేయకూదంటూ..వాటి కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా వారిలో మార్పు రాకపోగా వ్యాపారానికి తమ పంథాను మార్చుకున్నట్లు తెలిసింది.


ప్రత్యేక నిఘా పెట్టాం

రమణబాబు, డీఎస్పీ, మహబూబాబాద్‌

గంజాయి రవాణాపై నిఘా తీవ్రం చేశాం. రవాణాదారులపై చర్యలు తీసుకుంటున్నాం. అమ్మినా..నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. యువతను మత్తు నుంచి దూరం చేసేందుకు గ్రామాల్లో కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని