logo

దేవాదుల పంపింగ్‌ ఆగింది.. పంట ఎండింది..

ఎన్నో ఆశలతో సేద్యం చేస్తున్న అన్నదాతలకు చి‘వరి’ తడులకు కష్టాలు తప్పడం లేదు. నారు పోసినప్పటి నుంచి కోతకు వచ్చే వరకు రైతులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు.

Published : 18 Apr 2024 06:02 IST

వెంకటాపూర్‌ మండలం నల్లగుంట సమీపంలో ఎండుతున్న వరి

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: ఎన్నో ఆశలతో సేద్యం చేస్తున్న అన్నదాతలకు చి‘వరి’ తడులకు కష్టాలు తప్పడం లేదు. నారు పోసినప్పటి నుంచి కోతకు వచ్చే వరకు రైతులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. వెంకటాపూర్‌ మండల పరిధిలోని రైతులను ఈ యాసంగి సాగుపై దేవాదుల చిన్నచూపు చూసింది. ఎండల తీవ్రతకు చెరువులు, కుంటలు ఎండిపోవడంతో దేవాదులే ఆధారమని ఎదురుచూస్తున్న రైతాంగానికి చేదు అనుభవం ఎదురైంది. దేవాదుల ప్రాజెక్టు పైపులైను వెంబడి సాగు చేసుకున్న వారితో పాటు ఏయిర్‌వాల్వ్‌ లీకేజీ నీళ్లను నమ్ముకుని సాగు చేసిన పంటలకు 15 రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. పొట్టదశలో ఉండి నీటి తడి లేక నేలమట్టమవుతున్నాయి. రేపో, మాపో నీళ్లు వస్తాయని ఎదురుచూసిన అన్నదాతలు పైరు ఎండుతుండటంతో.. దిగాలు చెందుతున్నారు. ఇప్పటికైనా నీళ్లు విడుదల చేస్తే కనీసం పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దేవాదుల పంపింగ్‌ నిలిపివేత

కన్నాయిగూడెం, న్యూస్‌టుడే: మండలంలోని గుట్టలగంగారంలోని జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్‌ హౌస్‌ నుంచి పంపింగ్‌ను నిలిపి వేస్తున్నట్లు డీఈఈ శరత్‌ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో అవసరాల మేరకు పంపింగ్‌ చేస్తున్నామన్నారు. భీంఘనపూర్‌లో నింపడానికి రెండు రోజులు పంపింగ్‌ చేశామని చెప్పారు. మరో వైపు తుపాకులగూడెం బ్యారేజీ వద్ద మొత్తం 59 గేట్లుండగా, ఒక్క గేటు ద్వారా 300 క్యూసెక్కుల ప్రవాహాన్ని కిందకు వదులుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని