logo

రాజుకున్న రాజకీయం

షెడ్యూల్‌ విడుదల అనంతరం అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు కసరత్తు చేస్తుంటే రాజకీయ పార్టీలు ప్రచార పర్వానికి తెర తీశాయి. అధికార పార్టీ సామదానభేద దండోపాయాలను ఉపయోగించి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే కూటమి అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు  ప్రయత్నిస్తున్నారు

Updated : 19 Mar 2024 06:41 IST

ప్రలోభాల వల వేస్తున్న వైకాపా

వ్యూహాత్మక ప్రచారంలో కూటమి అభ్యర్థులు

 

ఈనాడు, ఏలూరు: షెడ్యూల్‌ విడుదల అనంతరం అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు కసరత్తు చేస్తుంటే రాజకీయ పార్టీలు ప్రచార పర్వానికి తెర తీశాయి. అధికార పార్టీ సామదానభేద దండోపాయాలను ఉపయోగించి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే కూటమి అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు  ప్రయత్నిస్తున్నారు. ప్రచారానికి మే-11 వరకు వ్యవధి ఉండటంతో నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

 వైకాపా రూటే సపరేటు.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైకాపా నాయకులు తమ అధికార బలాన్ని వినియోగించుకుంటున్నారు. ఓటర్లను బతిమాలో భయపెట్టో తమ వైపు తిప్పుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో వాలంటీర్లు ఉండకూడదని ఎన్నికల సంఘం చెప్పినా ఉభయ జిల్లాల్లో అంతర్గత ప్రచారం మొత్తం వారి ద్వారానే జరుగుతోంది. ఇప్పటికే ఉంగుటూరు, ఆచంట, ఏలూరు ఇలా అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లు తమ పరిధిలోని 50 ఇళ్ల వాట్సాప్‌ గ్రూపుల్లో వైకాపాకే ఓటేయాలని లేదంటే ఫింఛను మొదలు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని భయపెడుతున్నారు. ఆ గ్రూపుల్లో వైకాపా నాయకులను కూడా చేర్చి రోజూ పార్టీకి సంబంధించిన పోస్టులు పెడుతూ జగన్‌కే ఓటేయాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పథకాల లబ్ధిపై ముద్రించిన కరపత్రాలను వాలంటీర్లు ఇంటింటికీ పంపిణీ చేసి వైకాపాకే ఓటేయాలని ప్రభావితం చేస్తున్నారు.
ఏలూరులో ఇటీవల ఓ వైకాపా నాయకుడు మహిళా దినోత్సవం రోజు డ్వాక్రా సీఆర్పీలకు సమావేశం నిర్వహించి. దాదాపు 200 మందికి ఒక్కోటి రూ.10వేలు విలువైన ఫోన్లు పంపిణీ చేశారు. వారి ద్వారా తమ డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలను ప్రభావితం చేసేందుకు ఇదో ఎత్తుగడ. ఇలా ఆచంట, పోలవరం, ఉంగుటూరు, ఏలూరు ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో దుస్తులు పంపిణీ చేయటం, విందు భోజనాలు పెట్టడం ద్వారా ఆకట్టుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఓటగటం కంటే ఈ తరహా ప్రలోభాలతో ఓట్లు దండుకునేందుకే వైకాపా నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

సమన్వయంతో ముందుకు.. అధికార పార్టీ తాయిలాల రాజకీయం చేస్తూ ఎన్నికల విందులతో ముందుకు వెళుతుంటే కూటమి అభ్యర్థులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెబుతూ జనాల్లోకి వెళుతున్నారు.  పాదయాత్రలు చేపడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. సాయంత్రం వరకు ప్రచారంలో ఉంటూనే రాత్రిళ్లు ప్రధాన నాయకులు, వివిధ వర్గాలతో సమావేశమవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి నుంచి ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా మిగిలిన పార్టీల కార్యకర్తలు సైతం ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినా సర్దుబాటు చేసుకుని ముందుకువెళుతున్నారు. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి ధర్మరాజుకు సీటు కేటాయించినా తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కూటమి విజయానికి సహకరిస్తామని ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నారు. తాడేపల్లిగూడెంలో సైతం సయోధ్య కుదిరింది. దీంతో అన్ని వర్గాలను కలుపుకొని ప్రచారంలో దూసుకుపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని