logo

సాయం కోరితే ఖాతాలో నగదు మాయం

నగదు డిపాజిట్ చేసేందుకు సాయం కోరిన వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతడి బ్యాంకు ఖాతాలో నగదు కాజేసిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Published : 16 Apr 2024 05:13 IST

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: నగదు డిపాజిట్ చేసేందుకు సాయం కోరిన వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతడి బ్యాంకు ఖాతాలో నగదు కాజేసిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జంగారెడ్డిగూడెం పట్టణం ఉప్పలమెట్ట ప్రాంతానికి చెందిన వల్లూరి గురుమూర్తి వడ్రంగి. గత నెల 20న బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్ చేసేందుకు స్థానికంగా ఉన్న కరూర్‌ వైశ్యా బ్యాంకు ఏటీఎంకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న షేక్‌ నాగూర్‌బాబు అనేవ్యక్తి సాయం కోరాడు. ఏటీఎం కార్డు, రూ.3 వేల నగదును గురుమూర్తి.. నాగూర్‌బాబుకు ఇవ్వడంతో పాటు పిన్‌ నంబరును సైతం చెప్పాడు. అనంతరం అతడు నగదు డిపాజిట్ చేసి అదే తరహాలో ఉన్న మరో ఏటీఎం కార్డును గురుమూర్తికి ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ నెల 3న నగదు కోసం ఏటీఎంకు వెళ్లి కార్డు ద్వారా తీసుకునేందుకు గురుమూర్తి ప్రయత్నించగా పిన్‌ నంబరు తప్పని వచ్చింది. దీంతో బ్యాంకు అధికారులను సంప్రదించాడు. ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.71 వేలు డ్రా చేసినట్లు తెలపడంతో బాధితుడు సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్‌ రైటర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని