logo

జగన్‌ మాట మిగిలిపోయి... టమాట రైతు చితికిపోయి!

‘మన ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రైతులకు అండగా ఉంటుంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Published : 16 Apr 2024 02:14 IST

అయిదేళ్లలో అభివృద్ధికి నోచుకోని మార్కెట్‌
సంవత్సరానికి రూ.1.65 కోట్ల సెస్సు వసూలు
-న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం, గ్రామీణ

‘మన ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రైతులకు అండగా ఉంటుంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మదనపల్లె ప్రాంతంలో రైతులు పండించే టమాటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత జగన్‌ తీసుకుంటాడు. ధరల్లేని పరిస్థితిలో ప్రభుత్వమే రైతులు పండించిన టమాటాలను కొనుగోలు చేసేందుకు వీలుగా రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేయిస్తా.  రైతులు ముఖంలో చిరునవ్వును చూడడమే మా ప్రభుత్వం లక్ష్యం. ’  

-ఇదీ 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లెకు ప్రతిపక్ష నేత హోదాలో వచ్చిన సీఎం జగన్‌ అన్న మాటలివి.

సీఎం జగన్‌ మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతనలేకుండా పోయింది. మదనపల్లె టమాట మార్కెట్‌ యార్డు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మార్కెట్‌. ఇక్కడ నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతుంటాయి. సీజన్‌లో (ఏప్రిల్‌ నుంచి జులై) రోజుకు 1,200 మెట్రిక్‌టన్నులకుపైగా రైతులు పండిస్తారు. ఇటువంటి మార్కెట్‌ యార్డులో గత ఐదేళ్లుగా వైకాపా పాలనలో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లలో టమాటకు ధర లేకపోవడంతో చాలా మంది రైతులు మండీల్లోనే వదిలేశారు. సీఎం జగన్‌ ప్రకటించిన ధరల స్థిరీకరణ నిధి రైతులను ఆదు కోలేకపోయింది. యార్డులో అభివృద్ధి పనులకు వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి విదల్చలేదు. ఇక్కడ ఏడాది రూ.2.65 కోట్లు సెస్సు వసూలు చేయాల్సి ఉండగా, గతేడాది రూ.1.67 కోట్లు వసూలు చేశారు. ఇంత ఆదాయం వస్తున్నా యార్డులో రైతులకు కనీస వసతులు కల్పించకపోవడం గమనార్హం. ప్రస్తుతం వేసవిలో రైతులు తాగేందుకు నీరు, సేద తీరేందుకు నీడ కూడా లేకపోవడం గమనార్హం.

తెదేపా ప్రభుత్వ హయాంలో టమాట మార్కెట్‌ యార్డులో 3.60 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కనీసం వీటిని వినియోగించుకుని రైతులకు సేవలందించ లేకపోయారు. దళారీ వ్యవస్థ నుంచి రైతులను రక్షించేందుకు అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ-నామ్‌ పద్ధతిని తీసుకొచ్చింది. రైతుల వద్ద నుంచి నేరుగా టమాటాలను కొనుగోలు చేసే విధంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు సేదతీరేందుకు రైతు విశ్రాంతి భవనం నిర్మించారు. పలురకాల పండ్లను మాగపెట్టేందుకు కోల్డ్‌స్టోరేజి నిర్మించారు. రైతులకు తాగునీటిని అందించేందుకు ఓవర్‌హెడ్‌ట్యాంకు నిర్మించారు. వీటితో పాటు రైతులు మార్కెట్‌కు తెచ్చిన టమాటాలు ఎండకు, వానకు దెబ్బతినకుండా ఉండేందుకు షెడ్లు నిర్మించారు. ప్రస్తుతం వీటిని మాత్రమే వినియోగించుకుంటున్నారు. మిగిలినవన్నీ నిరుపయోగంగానే మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని