logo

మిల్లులకు నేరుగా ధాన్యం!

వరి పండించడం ఒక ఎత్తయితే.. చేతికివచ్చిన పంటను అమ్ముకోవడం మరో సవాలుగా మారుతోంది. టోకెన్‌కు ఎదురు చూపులు... వాహనాల్లో ధాన్యంతో రాత్రి, పగలు పడిగాపులు పడి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నిన్నమొన్నటి

Published : 08 Dec 2021 00:51 IST

నిబంధనలకు విరుద్ధంగా తరలింపు
ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌, న్యూస్‌టుడే, దౌల్తాబాద్‌

దౌల్తాబాద్‌లో వడ్లను మిల్లుకు తరలిస్తున్న రైతు

రి పండించడం ఒక ఎత్తయితే.. చేతికివచ్చిన పంటను అమ్ముకోవడం మరో సవాలుగా మారుతోంది. టోకెన్‌కు ఎదురు చూపులు... వాహనాల్లో ధాన్యంతో రాత్రి, పగలు పడిగాపులు పడి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నిన్నమొన్నటి వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం లెక్కవేయించి నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లు ఇచ్చిన ట్రక్‌షీట్‌ను కొనుగోలు కేంద్రాల సిబ్బందికి అందిస్తున్నారు. దీంతో రైతులకు కొంత వరకు ఇబ్బందులు తీరుతున్నా, ఈ విధానం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వేధింపులు తగ్గుతున్నాయి
ఇలా చేయడం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తొలుగుతున్నాయని, కోతల పేరుతో వేధింపులు తగ్గుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ధాన్యంలో తేమ శాతం ఉంటే ఎంత కోత విధిస్తారనేది రైతుకే నేరుగా తెలిసిపోతోంది. గతంలో మిల్లులకు పంపించడం, లారీలో ఏ ఒక్కరి ధాన్యంలో తాలు ఉన్నా, తేమ ఉన్నా దాని ప్రభావం లారీలోని అన్ని బస్తాలపైనా కనిపించేది. దీంతో రైతుకు బిల్లు చేతికి వచ్చేంత వరకు ఎన్ని డబ్బులు వస్తాయనేది అంతుచిక్కేది కాదు. ప్రస్తుతం మిల్లరు ఇచ్చిన ట్రక్‌షీట్‌ ఆధారంగా నేరుగా రైతు ఖాతాలకు డబ్బు జమ అవుతుంది. దీంతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది, మిల్లర్లు చెప్పే తరుగు సమస్య తీరుతోందని, హమాలీ, కార్మికుల కూలీ డబ్బులు మిగులుతున్నాయని అంటున్నారు. కాని నేరుగా రైతులే మిల్లుకు తీసుకెళ్లడం వల్ల ఎక్కడ అక్రమాలు జరుగుతాయో అన్న భయం అధికారులను వెంటాడుతోంది. .


124 కొనుగోలు కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా 1.11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రధానంగా కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట, దోమ, పరిగి, కుల్కచర్ల, యాలాల, బషీరాబాద్‌ మండలాల్లో అత్యధికంగా సాగైంది. 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయన్నది అధికారుల అంచనా. వాటికి అనుగుణంగా 124 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పనిఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో రైతులకు వ్యవసాయ శాఖాధికారుల నుంచి తేమ శాతం పత్రం తీసుకుని ధాన్యం బస్తాలను నేరుగా మిల్లులకు తరలించుకుంటున్నారు. అక్కడ తూకం వేశాక, ఎంత మొత్తంలో ధాన్యం ఉంటే దానికి సరిపడా బిల్లులను మిల్లుల యాజమాన్యం రైతులకు అందిస్తోంది. దాన్ని తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో సిబ్బందికి అందిస్తున్నారు.


తరుగు, హమాలీ ఖర్చులు తగ్గాయి: నజీర్‌, కౌడీడు

మూడు ఎకరాల్లో వరి వేశా. మొత్తం 180 బస్తాల దిగుబడి వచ్చింది. గతంలో వడ్లు నింపుకొని కల్లం, కొనుగోలు కేంద్రం వద్ద చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం నేరుగా పెద్ద కాంటాపై వేస్తున్నాం. అక్కడి నుంచి మిల్లుకు తరలిస్తున్నాం. దీంతో హమాలీ, కూలీల ఖర్చులు మిగులుతున్నాయి. అంతా సక్రమంగా ఉంటే ఒక బస్తాకు ఒకటిన్నర కేజీ తరుగు తీస్తున్నారు. గతంలో ఆరు కిలోల వరకు తరుగు తీసేవారు. ఈ పద్ధతి బాగుంది.


ఎవరి ఖర్చు వారిదే: వెంకటప్ప, దౌల్తాబాద్‌

రెండు ఎకరాల వరికి 120 బస్తాల దిగుబడి వచ్చింది. గతంలో వడ్లు తూకం వేసి, కొనుగోలు కేంద్రంలో నిలువ చేసేవాళ్లం. అక్కడి నుంచి మిల్లరకు పంపించే వారు. అంత వరకు ధాన్యం బాధ్యత మాపైనే ఉండేది. ఇక లారీలో ఎక్కడైనా, ఒకటి రెండు బస్తాల ధాన్యంలో తŸరుగు ఎక్కువగా ఉంటే అందరిపైనా దాని ప్రభావం కనిపించేది. మీ వడ్లు నాణ్యతగా లేవని సంచికి నాలుగు కిలోల నుంచి ఆరు కిలోల తరుగు తీసేవారు. ప్రస్తుతం ఎవరి ధాన్యం వారిదే బాధ్యత. ఆరబెట్టుకుని వెళితే ఇబ్బంది ఉండదు. కూలీలు, హమాలీ ఖర్చులు తగ్గాయి.


రవాణా బాధ్యత నిర్వాహకులదే
రాజేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

కేంద్రాల్లో ధాన్యం విక్రయించాక వారి బాధ్యత తీరిపోతుంది. తేమ శాతం, తరుగు పరిశీలించి రైతులకు వే బిల్లు ఇస్తారు. అక్కడి నుంచి కేంద్రాల నిర్వాహకులదే పూర్తి బాధ]్యత. ఇక్కడి నుంచే లారీల్లో మిల్లులకు పంపిస్తారు. నేరుగా రైతులే మిల్లులకు తరలించడం నిబంధనలకు విరుద్ధం. నిర్వాహకులు అనుమతించడం సరికాదు. వారిపై చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాలను సందర్శించి పర్యవేక్షిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని