logo

పతంగి తెచ్చిన చీకట్లు!

నగరంలో కొద్దిరోజులుగా విద్యుత్తు అంతరాయలు పెరిగాయి. ఎక్కువ ప్రాంతాల్లో తరచూ కరెంట్‌ పోతోంది. 1912కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శీతాకాలంలో కరెంట్‌ కటకట ఏంటని వినియోగదారులు వాపోతున్నారు. సంక్రాంతి పండగ పూట గాలి పటాలు విద్యుత్తు తీగలకు చుట్టుకోవడం,

Published : 17 Jan 2022 05:01 IST
విద్యుత్తు తీగలకు చుట్టుకుని సరఫరాలో అంతరాయాలు
ఈనాడు, హైదరాబాద్‌

గరంలో కొద్దిరోజులుగా విద్యుత్తు అంతరాయలు పెరిగాయి. ఎక్కువ ప్రాంతాల్లో తరచూ కరెంట్‌ పోతోంది. 1912కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శీతాకాలంలో కరెంట్‌ కటకట ఏంటని వినియోగదారులు వాపోతున్నారు. సంక్రాంతి పండగ పూట గాలి పటాలు విద్యుత్తు తీగలకు చుట్టుకోవడం, అకాల వర్షాలు, విద్యుత్తు నిర్వహణ మరమ్మతులతో కరెంట్‌ సరఫరాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు. పండగ రోజు పెద్ద ఎత్తున ఫీడర్లలో కరెంట్‌ సమస్యలు తలెత్తాయి. పండుగ మూడ్రోజుల్లో పతంగుల కారణంగా 553 ఫీడర్లలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. వర్షంతో శని, ఆదివారాల్లో 245 ఫీడర్లలో చీకట్లు అలుముకున్నాయి.

కొత్త సంవత్సరం నుంచి..

కొత్త సంవత్సరం ఆరంభం నుంచి గాలిపటాలు ఎగురవేయడం మొదలైంది. అప్పటి నుంచి సిటీలో విద్యుత్తు అంతరాయలు పెరిగాయి. పతంగులు, మాంజాలు సమీపంలోని విద్యుత్తు తీగలకు చుట్టుకోవడం.. వాటిని గట్టిగా లాగడంతో పలు ప్రాంతాల్లో లైన్లు ట్రిప్పయ్యాయి. సరఫరాలో హెచ్చుతగ్గులు, లోవోల్టేజీ.. ఇలా ఒక్కోచోట ఒక్కో సమస్య తలెత్తింది. పతంగులతో ఎక్కువగా ప్రధాన నగరంలో అంతరాయాలు ఏర్పడ్డాయి. కుల్సుంపురా, సరోజినిదేవి హాస్పిటల్‌ ఫీడర్‌, బాలంరాయి, పుత్లీబౌలి, నెహ్రూనగర్‌, ఏ.జి.కాలనీ, షాదన్‌ కళాశాల, మలక్‌పేట, మోండా మార్కెట్‌, బోయిన్‌పల్లితో పాటూ పెద్ద సంఖ్యలో ఫీడర్లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయి.

మరమ్మతులతోనూ..

ప్రస్తుతం నగరంలో వేసవి ముందస్తు మరమ్మతు పనులు నడుస్తున్నాయి. ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని కార్పొరేట్‌ కార్యాలయం నుంచి సిబ్బందికి ఆదేశాలున్నాయి. దీంతో రెండు మూడు గంటల పాటూ లైన్‌క్లియర్‌ తీసుకుని పలు ప్రాంతాల్లో లైన్ల మరమ్మతులు చేపడుతున్నారు. కాటేదాన్‌ విద్యుత్తు ఉపకేంద్రంలో ఆదివారం మరమ్మతులు చేపట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు లైన్లకు సమీపంలో ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి రెండు మూడు గంటలు కరెంట్‌ తీస్తే మరమ్మతులు అనుకోవచ్చు కానీ.. తరచూ ఒకటి రెండు గంటలు పోతుంటే ఎలా అని వినియోగదారులు అంటున్నారు. ఫిబ్రవరి చివరి వరకు మరమ్మతు పనులు కొనసాగుతాయని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.

అకాల వర్షాలూ తోడై..

ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు సమస్యలకు కారణంగా అధికారులు చెబుతున్నారు. శనివారం కాప్రా, ఉప్పల్‌, సరూర్‌నగర్‌, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కరెంట్‌ లేక చీకట్లు అలుముకున్నాయి. అప్పటికే తీగలను చుట్టుకున్న గాలిపటాలకు వర్షం తోడవడంతో సమస్య జటిలమైంది. పండగ కావడంతో సిబ్బంది అందుబాటులో లేక మరమ్మతుల్లో జాప్యం జరిగింది.


ఆన్‌లైన్‌ తరగతులకు అవస్థలు..

సోమవారం నుంచి పెద్దలకు ఆన్‌లైన్‌లో కార్యాలయాలు, పిల్లలకు ఆన్‌లైన్‌లోనే తరగతులు ప్రారంభం అవుతుండటంతో విద్యుత్తు అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.


ఇబ్బందులు లేకుండా చర్యలు 

- జె.శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్‌(ఆపరేషన్స్‌), టీఎస్‌ఎస్పీడీసీఎల్‌

గ్రేటర్‌లో గాలిపటాలు ఎగురవేయడానికి ముందు ప్రతిరోజు సగటున 70 నుంచి 80 ఫీడర్లలో అంతరాయాలు ఉండేవి. ఇటీవల చూస్తే ఎక్కువ ఫీడర్లు ట్రిప్పువుతున్నాయి. భోగి రోజు 228, సంక్రాంతి రోజు 182, కనుమ నాడు 143 ఫీడర్లలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కేవలం గాలిపటాల కారణంగా తలెత్తాయి. తీగలకు చిక్కుకున్న పతంగులు, మాంజా, దారాలను సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. సోమవారం నుంచి అంతరాయం లేకుండా సరఫరా అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని