Lifestyle: కసరత్తులు చేయలేకపోతే.. ఈ చిన్నమార్పులు చేసి చూడండి!

ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం తప్పనిసరి. రోజు కనీసం అరగంట సేపయినా శరీరానికి శ్రమ కల్పించకపోతే కొవ్వు నిల్వలు పెరిగి ఊబకాయులుగా మారడం, ఆ తర్వాత అనేక వ్యాధులకు గురికావడం జరిగిపోతాయి. అయితే, ఈ ఆధునిక కాలంలో, ఉరుకులు పరుగుల జీవితంలో పని ఒత్తిడి కారణంగా కావొచ్చు.. బద్ధకించి కావొచ్చు

Published : 12 Apr 2022 19:50 IST

ఆరోగ్యకరమైన జీవితానికి ఈ మార్పులు అవసరమే మరి!

ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం తప్పనిసరి. రోజుకు కనీసం అరగంట సేపయినా శరీరానికి శ్రమ కల్పించకపోతే కొవ్వు నిల్వలు పెరిగి ఊబకాయులుగా మారే అవకాశముంది. ఆ తర్వాత అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఈ విషయం తెలిసినా ఈ ఆధునిక కాలంలో, ఉరుకులు పరుగుల జీవితంలో పని ఒత్తిడి కారణంగా కావొచ్చు.. బద్ధకించి కావొచ్చు.. కొందరు వ్యాయామం చేయలేకపోతున్నారు. అలాంటి వ్యక్తులు తమ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఈ సూచనలు పాటించాలంటున్నారు.

పంచదారకు బదులు బెల్లం

తీపి ఎవరికి చేదు అన్నట్లు.. పంచదారను మనమంతా ఎంతో ఇష్టంగా వాడేస్తుంటాం. టీ, కాఫీ మొదలుకొని స్వీట్లు, పండ్ల రసాల వరకూ అన్నింట్లోనూ పంచదారను ఉపయోగిస్తుంటాం. కానీ, అది శ్రేయస్కరం కాదు. పంచదార వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది వరకే మధుమేహం ఉంటే చక్కెర స్థాయి పెరిగి ప్రమాదకరంగా మారొచ్చు. కాబట్టి పంచదారకు బదులు బెల్లంను ఉపయోగించడం ఉత్తమం. బెల్లంలో తీపిదనమే కాదు.. ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన ఐరన్‌, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్‌ మెండుగా ఉంటాయి.

చన్నీళ్లకు బదులు వేడి నీరు

ఇంట్లో పెద్దలు నీళ్లను వేడి చేసుకొని తాగాలని సూచిస్తుంటారు. ఎందుకంటే.. వేడి నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. జీవక్రియ సరిగా జరిగేలా దోహదపడుతుంది. చన్నీళ్లు తాగినప్పుడు కన్నా.. వేడినీళ్లు తాగినప్పుడే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుందట.

10వేల అడుగులు నడవాల్సిందే!

తిని కూర్చుంటే శరీరంలో కొవ్వులు పేరుకుపోతాయి. కాబట్టి, శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవాలి. వ్యాయామం కుదరకపోతే రోజుకు కనీసం 5వేల నుంచి 10వేల అడుగులు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జ్యూస్‌ కాదు.. పండ్లకే ఓటు

చాలా మంది పండ్లను జ్యూస్‌ చేసుకొని తాగుతుంటారు. దీనివల్ల ఆరోగ్యపరంగా పెద్దగా ప్రయోజనం ఉండదు. జ్యూస్‌ తీయగా ఉండాలని పంచదార కలుపుతుంటారు. వడపోత వల్ల ఫైబర్‌ అందదు. అదే నేరుగా పండ్లనే తింటే వాటిలోని పోషకాలతోపాటు, ఫైబర్‌ శరీరంలోకి చేరి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

భోజనం విషయంలో జాగ్రత్త

చాలా మంది ఒక పూట భోజనం చేయడం మానేస్తే ఏం అవుతుందిలే? ఒక పూట ఆలస్యంగా తింటే ఏం కాదులే.. అనుకుంటారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతి రోజు నిర్దేశించుకున్న సమయానికి భోజనం తప్పకుండా చేయాలి. అలాగే, ఒకేసారి ఎక్కువ తిని భుక్తాయాసం పడే బదులు తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినడం మేలు. ఇలా చేస్తే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

నిద్ర విషయంలో నిర్లక్ష్యం వద్దు

రాత్రి పడుకునే ముందు కొన్ని గంటల పాటు మొబైల్‌ ఫోన్‌తోనే గడిపేస్తోంది నేటి యువత. ఇలా రాత్రుళ్లు ఫోన్లకు అత్తుకుపోయి నిద్రకు దూరమవుతున్నారు. రోజుకు కనీసం 6-8 గంటల నిద్ర మనిషికి తప్పనిసరిగా అవసరం. అప్పుడే మెదడు చలాకీగా పనిచేస్తుంది.. శరీరం సహకరిస్తుంది. కాబట్టి.. వేళకు కంటినిండ నిద్రపోవాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని