E-book reader : ఈ-బుక్‌ రీడర్‌ కళ్లజోడు వచ్చేస్తోంది.. ఎన్ని గంటలైనా ఏకాగ్రతగా చదువుకోవచ్చట!

వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ (vr headset) తరహాలో రూపొందించిన ఈ-బుక్‌ రీడర్‌ (E-book reader) కళ్లజోడు త్వరలో మార్కెట్లోకి రానుంది. అందులో ఎలాంటి ఫీచర్లున్నాయో తెలుసుకోండి.

Updated : 05 Jul 2023 15:14 IST

(Image : solreader.com)

పుస్తకాల (Books) స్వరూపం రోజురోజుకీ మారిపోతోంది. సాంకేతికత (Technology) అభివృద్ధి చెందడంతో ఇటీవలి కాలంలో చాలా పుస్తకాలు పీడీఎఫ్‌ల రూపంలోకి వచ్చేశాయి. పీడీఎఫ్ (PDF) మాత్రమే కాకుండా ఈపీయూబీ, ఏజెడ్‌డబ్ల్యూ, హెచ్‌టీఎంల్‌, పీడీబీ, డాక్స్‌ ఇలా రకరకాల ఫార్మాట్లను కంప్యూటర్, ట్యాబ్‌, మొబైల్‌ ఫోన్ల ద్వారా చదివే అవకాశం పాఠకులకు కలిగింది. ప్రస్తుతం ఈ-బుక్‌ రీడర్లు (E-book reader) ఎక్కువ మంది ట్యాబ్‌లను వినియోగిస్తున్నారు. కళ్లపై ఒత్తిడి పడకుండా చదువుకునేందుకు అవి అనుకూలంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. అలాంటి పాఠకులను ఆకట్టుకునేందుకు కొత్తగా మార్కెట్లోకి ఈ-బుక్‌ రీడర్‌ కళ్లజోడు రాబోతోంది. దాని విశేషాలు తెలుసుకోండి.

ఏకాగ్రత కుదిరేలా..

సోల్‌ రీడర్‌ అనే కంపెనీ సరికొత్త ఈ-బుక్‌ రీడర్‌ను అభివృద్ధి చేసింది. ఈ పరికరం చూడటానికి చలువ కళ్లద్దాలను పోలి ఉంటుంది. ఒక వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ను ధరిస్తే అందులోని కంటెంట్‌లో ఎలా లీనమవుతామో ఈ-బుక్‌ రీడర్‌ కళ్లజోడు అలాంటి అనుభూతినే కలిగిస్తుందని కంపెనీ చెబుతోంది. పాఠకులు కిండిల్‌ వంటి ఈ-రీడర్లతో ఎక్కువ సేపు చదివేస్తున్నారు. మామూలు పుస్తకాల మాదిరిగానే అందులోని పేజీలను తిరగేస్తుంటారు. వాటిని చదువుతున్నప్పుడు కళ్ల మీద ఎలాంటి ఒత్తిడి పడదు. దానికి కారణం ఆ తెరల వెనకాల ఉన్న ఈ ఇంక్‌ డిస్‌ప్లే టెక్నాలజీ. కానీ, పరిసరాల కారణంగా మనసు పుస్తకంలో నుంచి బయటకు వెళ్తుంది. అలాంటి అవాంతరాలకు ఈ-బుక్‌ రీడర్‌ కళ్లజోడు అడ్డుకట్ట వేస్తుంది. ఈ పరికరం ధరిస్తే అక్షరాలు తప్ప మరేవీ కనిపించవు. దాంతో ఏకాగ్రతగా ఎంత సేపయినా చదువుకోవచ్చు. ఈ-బుక్‌ చదవాలంటే ట్యాబ్‌, మొబైల్‌ను చేతితో పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ కళ్లజోడును కేవలం తలకు తగిలించుకుంటే సరిపోతుంది. 

(Image : solreader.com)

కంటి చూపునకు తగ్గట్లుగా..

సోల్ రీడర్‌లో 1.3 ఇంచుల సైడ్‌ లిట్‌ ఇ ఇంక్‌ డిస్‌ప్లే రావడం వల్ల ఇది కళ్లపై ఒత్తిడి పడకుండా చూస్తుంది. ఆ డిస్‌ ప్లే  65,536 పిక్సెల్స్‌తో వస్తుంది. ఇందులో డయాప్టర్‌ సర్దుబాటు సదుపాయం ఉంది. ఆ డయాప్టర్‌ను వినియోగించుకుని దృష్టి లోపం ఉన్న వారు తమ చూపునకు తగినట్లుగా అక్షరాలను మార్చుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా కళ్లద్దాలు, కాంటాక్ట్‌ లెన్సులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. 

ఈ కళ్లజోడు 100 గ్రాముల బరువుంది. బ్లాక్‌ సన్‌ గ్లాసెస్‌ తరహాలో వీటి లుక్‌ డిజైన్‌ చేశారు. కూర్చుని లేదా పడుకొని చదువుకోవచ్చు. కంపెనీ ఇచ్చిన రిమోట్‌ను చేతిలో ఉంచుకొని.. బటన్‌లను నొక్కి కావాల్సిన పేజీ దగ్గర ఆపేయొచ్చు.

30 గంటలు వాడుకోవచ్చు

ఈ-బుక్‌ రీడర్‌లోని పేజీలు నల్లటి బ్యాక్‌గ్రౌండ్‌కు వ్యతిరేకంగా ప్రొజెక్ట్ అవుతాయి. దాంతో పాఠకుడికి మామూలు బుక్‌ చదువుతున్న అనుభూతి కలుగుతుంది. సోల్‌ రీడర్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దాన్ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 30 గంటలపాటు వాడుకోవచ్చు. ఇందులో 60 ఎంబీ స్టోరేజ్‌ సామర్థ్యం ఇచ్చారు. హెడ్‌సెట్‌ను మొబైల్‌ యాప్‌ ద్వారా అనుసంధానించుకొని ఆ యాప్‌లోకి చదుకోవాలనుకునే ఫైళ్లను కాపీ చేసుకోవచ్చు. అందువల్ల స్టోరేజీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఇవి ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఒక్కోదాని ధర 350 డాలర్లు ఉంటుందని టెక్‌ వర్గాల సమాచారం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని