Featherless chicken : రెండు దశాబ్దాల క్రితమే ఈకలు లేని కోళ్ల సృష్టి.. ఎందుకు మార్కెట్లోకి రాలేదంటే!

దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈకలు లేని కోళ్లను (Featherless chicken) ఓ శాస్త్రవేత్త అభివృద్ధి చేశాడు. అయినా అవి ఇంత వరకు మన మార్కెట్లలోకి రాలేదు. అందుకు కారణాలు ఏంటంటే..? 

Updated : 09 Jul 2023 12:48 IST

Image : SOPHALLETH

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్‌ను (Chicken) ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే ఈ కోళ్లు వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక చనిపోతుంటాయి. ఆ సమస్యకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో ఓ ఇజ్రాయెల్ శాస్త్రవేత్త ఈకలు లేని కోళ్లను సృష్టించాడు. వాటిలోని ప్రత్యేకత ఏంటి? ఆ రకం కోళ్లు ఇంకా ఎందుకు మన మార్కెట్లోకి రాలేదు.. తదితర విషయాల గురించి చదివేయండి.

బ్రాయిలర్‌ కోడికి ప్రత్యామ్నాయం

ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బ్రాయిలర్‌ కోళ్లు జన్యుపరంగా మార్పు చేసినవి. అవి దాణా ఎక్కువగా తింటాయి. దాంతో జీవక్రియ వేగంగా జరుగుతుంది. అందువల్ల వాటి శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. గుండె నిమిషానికి 300 సార్లు కొట్టుకుంటుంది. ఈ బ్రాయిలర్‌ కోళ్లు వేగంగా పెరగడంతో వ్యాపారులు మాంసం డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేయగలుగుతున్నారు. అయితే ఈ రకం కోళ్లను వేడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో పెంచడానికి కూలర్లు వాడాల్సి వస్తోంది. ఒక వేళ అలా చేయకపోతే అవి చనిపోతున్నాయి. దాంతో పెంపకం దారులపై ఆర్థిక భారం పడుతోంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయం ఏంటనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈకలు లేని కోడి.

ఇజ్రాయెల్ శాస్త్రవేత్త కృషి

ఇజ్రాయెల్‌ జన్యుశాస్త్రవేత్త, కోళ్ల పెంపకంలో నిపుణుడు అవిగ్డోర్‌ కాహనర్‌ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈకలు లేని కోళ్ల జాతిని అభివృద్ధి చేశాడు. ఈయన జెరూసలెం హిబ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండేవాడు. కొత్త రకం చికెన్‌ను సృష్టించడానికి అవిగ్డోర్‌ కొన్ని అసహజ, అనైతిక జన్యుమార్పులు చేశాడని విమర్శలు వచ్చాయి. కానీ, తాను మెడ వద్ద ఈకలు లేని కోళ్లను, బ్రాయిలర్‌ కోళ్లను తీసుకొని మాత్రమే ప్రయోగాలు చేశానని స్పష్టం చేశాడు. ‘ఇది జన్యుపరంగా మార్పు చేసిన కోడి కాదు. సహజమైనది. వీటిలోని లక్షణాలు 50 ఏళ్ల క్రితం నాటివని’ వెల్లడించాడు.

లక్షణాలు.. అవ లక్షణాలు

2002వ సంవత్సరంలో అవిగ్డోర్‌ ఈకలు లేని కోళ్లను అభివృద్ధి చేశాడు. వాటి రూపం అసాధారణంగా ఉండటం వల్ల ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షించాయి. తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం, తొందరగా వృద్ధి చెందడం, కూలర్లు అవసరం లేకుండానే వేడిని తట్టుకోవడం వంటి లక్షణాలు ఈ జాతిలో ఉన్నాయని అవిగ్డోర్‌ పేర్కొన్నాడు.

అయితే ఈకలు లేని కోళ్లలో పలు లోపాలను పెంపకందారులు గుర్తించారు. వాటి రూపం పరాన్న జీవులను ఆకర్షించే విధంగా ఉందని చెప్పారు. దోమకాటు, చర్మవ్యాధులు, వడదెబ్బ, ఉష్ణోగ్రతలో వైవిధ్యాలను ఈ జాతి తట్టుకోలేదని వెల్లడించారు. పైగా ఈ సరికొత్త రూపం వల్ల మగకోళ్లు సంభోగం చేయడానికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది.

నాన్‌ వెజ్‌ ప్రియులకూ నచ్చలేదు

ఈకలు లేని కోడిని సృష్టించి రెండు దశాబ్దాలు దాటినా అవి మార్కెట్లోకి విస్తృతంగా రాకపోవడానికి ప్రధాన కారణం వాటి అసహజ రూపం. కొందరు నాన్‌ వెజ్‌ ప్రియులు సైతం వీటిని అసహ్యించుకున్నారు. అనారోగ్యకర సైన్స్‌కు ఇదో ఉదాహరణ అని ఇంకొందరు వ్యతిరేకించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రాయిలర్‌ కోళ్లు చాలని.. కొత్తగా ఇలాంటివి అవసరం లేదని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని