ప్రపంచ కుబేరుల తొలి ఉద్యోగాలు!
ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల్లో తొలివరుసలో నిలుస్తోన్న జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, వారెన్ బఫెట్ వంటి అనేక మంది సంపన్నులు మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి పైకొచ్చిన వారే. దీంతో వారు చేసిన తొలి ఉద్యోగం ఏమై ఉంటుందా
ఏటా ప్రపంచంలో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. కొంతమంది వారసత్వంగా వచ్చిన వ్యాపారాలను భుజాలకెత్తుకొని అభివృద్ధి చేస్తూ కోట్లకు పడగలెత్తితే, మరికొందరు స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల్లో తొలివరుసలో నిలుస్తోన్న జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, వారెన్ బఫెట్ వంటి అనేక మంది సంపన్నులు మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి పైకొచ్చిన వారే. దీంతో వారు చేసిన తొలి ఉద్యోగం ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..!
జెఫ్ బెజోస్
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ 1994లో అమెజాన్ సంస్థను స్థాపించారు. తన సంస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఆయన తొలిసారి మెక్ డొనాల్డ్స్‌లో ఫ్రైకుక్‌గా పనిచేశారు. అప్పుడు ఆయన వయసు 16 ఏళ్లే. ఒకవైపు చదువుకుంటూనే పనిచేస్తూ గంటకు 2.69 డాలర్ల వరకు సంపాదించేవారు. చదువు పూర్తయ్యాక టెలికమ్యూనికేషన్ స్టార్టప్.. ఫిటెల్ సంస్థలో తొలిసారి పూర్తిస్థాయి ఉద్యోగిగా చేరారు. ఆయన సంపద ప్రస్తుత నికర విలువ 212 బిలియన్ డాలర్లు.
ఎలన్ మస్క్
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మస్క్ కూడా స్వయంకృషితోనే ఎదిగారు. ఎలన్ మస్క్ 12 ఏళ్ల వయసులోనే స్పేస్ థీమ్‌డ్ వీడియో గేమ్ ‘బ్లాస్టర్’కు కోడింగ్ చేశారు. దాన్ని పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే మ్యాగజైన్కు ఇవ్వగా పారితోషికంగా 500 డాలర్లు వచ్చాయి. పెద్దయ్యాక నెట్‌స్కేప్ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంతకీ సంస్థ నుంచి స్పందన లేదు. దీంతో కింబల్, గ్రెగ్ కౌరీతో కలిసి 1995లో జిప్2 పేరుతో సాఫ్ట్‌వేర్ సంస్థ స్థాపించారు. ఆ తర్వాత ఎక్స్.కామ్, పేపాల్, స్పేస్ ఎక్స్ సంస్థలను నెలకొల్పారు. టెస్లా మోటార్స్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టి, ఆ తర్వాత ఏకంగా ఆ సంస్థనే సొంతం చేసుకున్నారు. ఆ కంపెనీయే ఇప్పుడు టెస్లా సంస్థగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన నికర విలువ 177 బిలియన్ డాలర్లు.
బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలోనే చదువు ఆపేసిన విషయం తెలిసిందే. టెక్నాలజీ రంగంపై తనకున్న ఆసక్తితో అటువైపుగా అడుగులువేశారు. తొలిసారి టీఆర్‌డబ్ల్యూ సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగంలో చేరారు. 1975లో పాల్ అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ స్థాపించారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ ఆస్తుల నికర విలువ 148 బిలియన్ డాలర్లు.
మార్క్ జూకర్‌బర్గ్
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరు..ఆ సంస్థ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్‌కు చిన్నతనం నుంచే ఇంటర్నెట్.. టెక్నాలజీపై అమితాసక్తి. అందుకే 18 ఏళ్ల వయసులోనే ఇంటెలిజెంట్ మీడియా గ్రూప్ సంస్థ కోసం సినాప్సీ పేరుతో మ్యూజిక్ రికమండేషన్ యాప్ రూపొందించారు. దాన్ని సొంతం చేసుకోవడానికి అనేక కంపెనీలు జూకర్‌బర్గ్‌తో చర్చలు జరిపాయి. అప్పట్లోనే 1 మిలియన్ డాలర్లు ఇస్తామని ఆఫర్ చేశాయి. కానీ, జూకర్‌బర్గ్ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు నిరాకరించారు. ఆ తర్వాత కాలేజీలో చదువుకుంటూ కూడా అనేక సాఫ్ట్‌వేర్‌లు ఆవిష్కరించారు. 2004లో ఫేస్‌బుక్‌ను లాంచ్ చేశారు. ఆ తర్వాత అది ప్రజల్లోకి ఎంతలా వెళ్లిపోయిందో.. నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జూకర్‌బర్గ్ నికర సంపద విలువ 130బిలియన్ డాలర్లు.
వారెన్ బఫెట్
పెట్టుబడుల్లో ఘనుడు.. బెర్క్‌షైర్ హాత్‌వే సంస్థ సీఈవో వారెన్ బఫెట్.. తన 13వ ఏట నుంచే ఉద్యోగం చేయడం ప్రారంభించారు. ఆయన తొలి ఉద్యోగం న్యూస్ పేపర్ డెలివరీ బాయ్. 1944 సమయంలో వాషింగ్టన్‌పోస్ట్ పత్రిక డెలివరీ బాయ్‌గా నెలకు 175 డాలర్ల వేతనానికి పనిచేశారు. ప్రస్తుతం వారెన్ బఫెట్ ఆస్తుల నికర విలువ 101 బిలియన్ డాలర్లు.
గౌతమ్ అదానీ
భారతీయ సంపన్నుడు, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ అనగానే అదానీ పోర్ట్స్ గుర్తొస్తాయి. కానీ, ఆయన తన సంస్థను స్థాపించే ముందు ఎన్నో పనులు, వ్యాపారాలు చేశారు. తండ్రికి టెక్ట్స్‌టైల్ కంపెనీ ఉన్నా.. సొంతంగా వ్యాపారం ప్రారంభించి తనకంటూ గుర్తింపు సంపాదించాలని భావించారు. అందుకే గుజరాత్‌లోని తన స్వస్థలం అహ్మదాబాద్ వదిలేసి, బ్యాచిలర్ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి ముంబయికి చేరుకున్నారు. 1978లో అప్పటికి టీనేజీలోనే ఉన్న అదానీ.. మహేంద్ర బ్రదర్స్ వజ్రాల వ్యాపారుల వద్ద డైమండ్ సార్టర్‌గా పనికి కుదిరారు. ఆ తర్వాత ఎన్నో వ్యాపారాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1988లో అదానీ గ్రూప్ స్థాపించిన గౌతమ్ అదానీ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన సంపద ప్రస్తుత నికర విలువ 54 బిలియన్ డాలర్లు.
రతన్ టాటా
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా.. అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు. నేరుగా ఆయన ఛైర్మన్ అయ్యే అవకాశాలున్నాయి. అయినా, టాటా సంస్థ బాధ్యతలు ఎత్తుకునే ముందు సంస్థ కష్టనష్టాలు తెలుసుకోవడం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో 1961లో టాటా స్టీల్ సంస్థలో ఆపరేషన్స్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్ పదవిని స్వీకరించారు. రతన్ టాటా ఆస్తుల ప్రస్తుత నికర విలువ దాదాపు 1 బిలియన్ డాలర్లు.
ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ప్రముఖ పారిశ్రామివేత్త జగదీశ్ చంద్ర మహీంద్రా మనవడు. వారసత్వంగా వచ్చిన వ్యాపారాలను మరింత అభివృద్ధి చేస్తున్నారు. మహీంద్రా గ్రూప్‌లో భాగంగా ఎన్నో వ్యాపారాలను తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్న ఆనంద్ మహీంద్రా తొలిసారి 1981లో మహీంద్రా ఉజిన్ స్టీల్స్ కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్‌కి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా సంపద నికర విలువ 1.9బిలియన్ డాలర్లు.
ఓప్రా విన్‌ఫ్రే
ఓ వ్యాఖ్యాత టెలివిజన్ ఇంటర్వ్యూ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించడమే కాదు.. టీవీ నెట్‌వర్క్‌ను స్థాపించి, ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు సంపాదించడం అంత సులువు కాదు. కానీ, ఓప్రా విన్‌ఫ్రే ఆ ఘనత సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఆమె.. ఇటీవల బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ దంపతులను ఇంటర్వ్యూ చేసి మరోసారి సంచలనం సృష్టించారు. అయితే, ఇంతటి పేరు సంపాదించడానికి ముందు ఓప్రా అతి సామాన్యురాలే. కుటుంబ సమస్యల కారణంగా తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటూ పేదరికాన్ని అనుభవించారు. టీనేజీలో ఉన్నప్పుడు తన ఖర్చుల కోసం కిరాణా అంగడిలో పనిచేశారు. ఆ తర్వాత మోడలింగ్, మీడియా రంగంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఓప్రా ఆస్తుల నికర విలువ 2.7బిలియన్ డాలర్లు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!