కేబినెట్‌లోకి మరో ఏడుగురు మహిళలు

కేంద్రంలో మహిళా మంత్రుల సంఖ్యాబలం మరింత పెరిగింది. కొత్తగా మరో ఏడుగురు బుధవారం

Published : 08 Jul 2021 10:17 IST

11కు చేరిన సంఖ్యాబలం

దిల్లీ: కేంద్రంలో మహిళా మంత్రుల సంఖ్యాబలం మరింత పెరిగింది. కొత్తగా మరో ఏడుగురు బుధవారం సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో కలిపి మొత్తం మహిళా మంత్రుల సంఖ్య 11కి చేరింది. ఈమేరకు కొత్తగా మంత్రిమండలిలో చేరినవారిలో మీనాక్షి లేఖి, శోభ కరంద్లాజే, అనుప్రియ సింగ్‌ పటేల్, దర్శన విక్రమ్‌ జర్దోష్, అన్నపూర్ణ దేవి, ప్రతిమా భౌమిక్, డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌లు ఉన్నారు. వీరిలో తొలిసారి ఎంపీలు అయినవారు ముగ్గురున్నారు. అనుప్రియ సింగ్‌ పటేల్‌ గతంలో ప్రధాని మోదీ నేతృత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీల (కేబినెట్‌ మంత్రులు)తో పాటు సాధ్వి నిరంజన్‌ జ్యోతి, రేణుకా సింగ్‌ సరూతాలు ఇప్పటికే మంత్రిమండలిలో ఉన్నారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా ఉన్న దేబశ్రీ చౌధురి బుధవారం ఉదయం రాజీనామా చేశారు. మోదీ తొలి ప్రభుత్వం (2014-19)లో 9 మంది మహిళా మంత్రులుండేవారు.

నేడు కేబినెట్, మంత్రిమండలి భేటీ!

విస్తరణ నేపథ్యంలో కేంద్ర కేబినెట్, మంత్రిమండలి భేటీలు గురువారం నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా మంత్రివర్గ విస్తరణ అనంతరం ప్రధాని ఈ భేటీలను నిర్వహిస్తుంటారు. ఈ రెండు సమావేశాలూ సాయంత్రం ఒకదాని వెంట మరొకటి నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మంత్రులకు ప్రధాని అభినందనలు

కేంద్ర మంత్రులుగా బుధవారం ప్రమాణస్వీకారం తన సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, భారత్‌ను సుదృఢమైన సౌభాగ్య దేశంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా అభినందనలు తెలిపారు.

16 మంది తొలిసారి ఎంపీలైనవారే..

కొత్తగా మొత్తం 36 మంది కేంద్ర మంత్రులుగా బుధవారం ప్రమాణస్వీకారం చేయగా.. వారిలో 16 మంది తొలిసారి ఎంపీలైనవారున్నారు.

సగటు వయసు 58..

విస్తరణ అనంతరం కేంద్ర మంత్రిమండలి సగటు వయసు 61 నుంచి 58 ఏళ్లకు తగ్గింది. మంత్రుల్లో 35 ఏళ్ల నిశీథ్‌ ప్రామాణిక్‌ (పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బిహార్‌ ఎంపీ) పిన్న వయస్కులు. 72 ఏళ్ల సోమ్‌ ప్రకాశ్‌ వయసులో అందరికంటే పెద్దవారు. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన 43 మంది మంత్రుల్లో సగటు వయసు 56 ఏళ్లు.

వైద్యులు.. న్యాయవాదులు.. ఇంజినీర్లు..

ప్రధాని మోదీ మంత్రిమండలిలోకి కొత్తగా చేరిన 36 మందిలో చాలామంది వివిధ వృత్తి నిపుణులున్నారు. వీరిలో పలువురు ఇంజినీర్లు కాగా.. 8 మంది న్యాయవాదులు, నలుగురు వైద్యులు, ఇద్దరు మాజీ ఐఏఎస్‌ అధికారులు, నలుగురు ఎంబీఏ పూర్తిచేసినవారు ఉన్నారు. మాజీ ఐఏఎస్‌ అధికారుల్లో ఒడిశాకు చెందిన అశ్వనీ వైష్ణవ్, బిహార్‌కు చెందిన రాంచంద్ర ప్రసాద్‌ సింగ్‌లు ఉన్నారు. వైద్యుల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన సుభాస్‌ సర్కార్‌ (గైనకాలజిస్ట్‌), మహారాష్ట్రకు చెందిన భగవత్‌ కిషన్‌రావు కరడ్‌ (జనరల్, పిడియాట్రిక్‌ సర్జన్‌), భారతి ప్రవీణ్‌ పవార్‌ (ఎంబీబీఎస్‌), గుజరాత్‌కు చెందిన ముంజపర మహేంద్రభాయ్‌ (కార్డియాలజిస్ట్‌)లు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని