Updated : 03 Sep 2020 19:01 IST

మంచుకొండల్లో నిప్పు కణికలు..

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం :  భారత్‌- చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలోని పలుప్రాంతాల్లో భారత సైన్యం కీలక పురోగతిని సాధించింది. డ్రాగన్‌ దళాల రాకను ముందే పసికట్టి మెరికల్లాంటి స్పెషల్‌ ఫ్రాంటియర్స్‌ దళాలు రంగంలోకి దిగి ఎత్తయిన ప్రాంతాలను కైవశం చేసుకున్నాయి. దీంతో యుద్ధమంటూ జరిగితే భారత దళాలదే పైచేయి అవుతుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సైన్యంలో ఉండరు.. కానీ చైనాకు చుక్కలుచూపిస్తారు..

1962 చైనాతో యుద్ధం అనంతరం స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.  టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న అనంతరం వేలాదిమంది టిబెటన్లు భారత్‌లోకి శరణార్ధులుగా వచ్చారు. వీరిలో కొంతమందితో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ దళంలో టిబెటన్లు, గూర్ఖాలు మాత్రమే ఉంటారు.  ఈ దళం భారతసైన్యంలో ఉండదు. నేరుగా ప్రధాని కార్యాలయంలోని క్యాబినెట్‌ సచివాలయం ఆదేశాల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

(ప్రతీకాత్మక చిత్రం)

మంచుకొండల్లో సవాళ్లకు రెడీ..

టిబెట్‌తో పాటు లద్దాఖ్‌ ప్రాంతాల్లో యుద్ధం చేయడమంటే సామాన్యమైన వ్యవహారం కాదు. అయితే టిబెటన్లు ఇక్కడవారే కావడంతో ఆ వాతావరణం వారికి అలవాటైంది. దీంతో పర్వతప్రాంతాల్లో ఎలాంటి ఆపరేషన్లనయినా సులువుగా నిర్వహించే సత్తా వారికి సొంతం. దీన్ని దృష్టిలో ఉంచుకొని 1962లో మేజర్‌ జనరల్‌ సుజాన్‌సింగ్‌ ఉబన్‌ ఈ దళానికి రూపకల్పన చేశారు. తొలినాళ్లలో అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ వీరికి శిక్షణ ఇచ్చింది. ఇక్కడి పర్వతప్రాంతాలు, లోయలు వీరికి కొట్టినపిండి కావడంతో యుద్ధంలో వీరిదే పైచేయి అవుతుంది. అందుకనే చైనా దళాలు వీరితో ఢీకొట్టడానికి ముందు వెనుకా ఆలోచిస్తాయి. ఈ బెటాలియన్లను వికాస్‌ పేరుతో పిలుస్తుంటారు.కోవర్టు ఆపరేషన్లలో వీరు ఆరితేరినవారు. కఠినమైన శిక్షణతో రాటుదేలి విధుల్లోకి ప్రవేశిస్తారు.

పలు ఆపరేషన్లలో కీలకపాత్ర..

బంగ్లా విముక్తి పోరాటంలో జరిగిన ఆపరేషన్‌ ఈగల్‌, పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల ఏరివేతకు నిర్వహించిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌, పాక్‌ నుంచి సియాచిన్‌ స్వాధీనం కొరకు జరిగిన ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌, , కార్గిల్‌ యుద్ధంలో ఆపరేషన్‌ విజయ్‌.. తదితర కీలకమైన ఆపరేషన్లలో ఈ దళాలు తమ సత్తా చాటాయి. భారత సైన్యానికి చేయూతగా వ్యవహరిస్తారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని