‘నమ్మకం’ అనే కోటాలో అంతరిక్షానికి యువతి!

హేలే ఆర్కేనాక్స్‌.. తన పదో ఏటానే బోన్‌ క్యాన్సర్‌ వల్ల ఎడమకాలును కోల్పోయింది. వైద్యులు ఆమెకు స్టీల్‌ రాడ్‌ను అమర్చారు. చిన్నతనంలోనే క్యాన్సర్‌పై విరోచితంగా పోరాడి, కాలు కోల్పోయినా మనోధైర్యంతో ముందుకు సాగింది. క్యాన్సర్‌కు కుంగిపోకుండా.. హేలే ఎదిగిన

Published : 25 Feb 2021 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హేలే ఆర్కేనాక్స్‌.. తన పదో ఏటానే బోన్‌ క్యాన్సర్‌ వల్ల ఎడమకాలును కోల్పోయింది. వైద్యులు ఆమెకు స్టీల్‌ రాడ్‌ను అమర్చారు. చిన్నతనంలోనే క్యాన్సర్‌పై విరోచితంగా పోరాడి, కాలు కోల్పోయినా మనోధైర్యంతో ముందుకు సాగింది. క్యాన్సర్‌కు కుంగిపోకుండా హేలే ఎదిగిన తీరు.. ఆమెలాంటి క్యాన్సర్‌ బాధితులకు జీవితంపై నమ్మకాన్ని కలిగిస్తోంది. ఆ నమ్మకమే ఆమెకు అంతరిక్షానికి వెళ్లే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అంతరిక్షంలోకి పంపించబోయే నలుగురు సాధారణ వ్యక్తుల్లో ఒకరుగా నిలిపింది. 

ప్రజలను ప్రైవేటుగా అంతరిక్షానికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో స్పేస్‌ ఎక్స్‌ అనే సంస్థ ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయాలు కూడా సాధిస్తోంది. కాగా.. జేర్డ్‌ ఐసాక్‌మన్‌ అనే కోటీశ్వరుడికి అంతరిక్షం అంటే ఆసక్తి. పైలట్‌గా విమానాలు నడిపిస్తూ ఆకాశంలో తిరిగిన అతడికి అంతరిక్షానికి వెళ్లిరావాలని ఆశ కలిగింది. అందుకే స్పేస్‌ ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఫాల్కన్‌ 9 రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు. తనతోపాటు మరోముగ్గురిని అంతరిక్షంలోకి తీసుకెళ్తాడట. ఇందుకోసం ఇన్స్‌పిరేషన్‌-4 పేరుతో ఓ ప్రాజెక్టును మొదలుపెట్టాడు. నాయకత్వం.. నమ్మకం.. శ్రేయస్సు.. దాతృత్వం ఈ నాలుగు అంశాలకు సంబంధించి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న నలుగురికి ఫాల్కన్‌ రాకెట్‌లోని నాలుగు సీట్లను కేటాయించాడు. ఒక ప్రైవేటు అంతరిక్షయానానికి తాను నాయకత్వం వహిస్తున్నందుకుగానూ.. నాయకత్వం కోటాలో ఐసాక్‌మన్‌ తొలి సీటు సంపాదించాడు.

తాజాగా ‘నమ్మకం’ కోటాలో 29 ఏళ్ల హేలే ఆర్కేనాక్స్‌ రెండో సీటును దక్కించుకుంది. సెయింట్‌ జుడే చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ ఆస్పత్రిలో ఫిజిషియన్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హేలే.. బోన్‌ క్యాన్సర్‌పై పోరాడిన యోధురాలిగా ఐసాక్‌మన్‌ గుర్తించాడు. ఆమె జీవితం.. ఎంతో మందికి నమ్మకాన్ని కలిగిస్తుందని భావించాడు. అందుకే ఆమెకు తన సహ వ్యోమగామిగా అవకాశమిచ్చాడు. ఈ విషయాన్ని ఐసాక్‌మన్‌ ప్రకటించగానే హేలే ఆనందం వ్యక్తం చేసింది. ఎవరైనా ఏదైనా సాధించొచ్చు.. ఏదైనా సాధించాలని సంకల్పించినవారికి ఆకాశం కూడా హద్దుగా ఉండదని హేలే చెప్పుకొచ్చింది. ఈ అవకాశంతో అంతరిక్షంలో అడుగుపెట్టే అమెరికన్‌ అతి పిన్న వయస్కురాలిగా, క్యాన్సర్‌ యోధురాలిగా హేలే ఖ్యాతి గడించనుంది. మరి మిగిలిన శ్రేయస్సు.. దాతృత్వం కోటాలో అంతరిక్షానికి వెళ్లే అవకాశాన్ని ఎవరు గెలుచుకుంటారో వేచి చూడాలి. ఈ ఇన్స్‌పిరేషన్‌-4 ప్రయాణం ఈ ఏడాది చివర్లో ఫోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రారంభం కానుంది. అప్పటిలోపు ఎంపికైన నలుగురు వ్యోమగాములకు తగిన శిక్షణ ఇస్తామని స్పేస్‌ ఎక్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని