కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్‌!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఇంట్లో బాంబు పెట్టానంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పడం కలకలం రేపింది. 

Published : 29 Mar 2023 01:37 IST

నాగ్‌పూర్‌:  కరెంటు కోతలతో కోపోద్రిక్తుడైన ఓ యువకుడు చేసిన పని పోలీసులకు అర్ధరాత్రి చెమటలు పట్టించింది. తన ఇంట్లో కరెంటు కోతలను భరించలేకపోయిన 30 ఏళ్ల యువకుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఇంటి వద్ద బాంబు పెట్టానంటూ పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పడం కలకలం రేపింది.  దీంతో అప్రమత్తమైన పోలీసు బృందాలు బాంబు స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌లతో  క్షుణ్ణంగా తనిఖీలు చేసి చివరకు అది నకిలీ ఫోన్‌ కాల్‌గా తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నాగ్‌పూర్‌కు 30 కి.మీల దూరంలోని కన్హన్‌ టౌన్‌కు చెందిన  యువకుడు (30 ) అర్ధరాత్రి 2గంటల సమయంలో నాగ్‌పూర్‌లోని పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌ చేశాడు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ నివాసం బయట బాంబు పెట్టినట్టు చెప్పి.. వెంటనే కాల్‌ కట్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు  బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. త్రికోణి పార్కు సమీపంలోని డిప్యూటీ సీఎం ఇంటికి చేరుకొని నివాస ప్రాంగణం లోపల, బయట క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించగా.. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని నాగ్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ అమితేశ్‌ కుమార్‌ వెల్లడించారు.  ప్రస్తుతం దేవేంద్ర ఫడణవీస్‌,  ఆయన కుటుంబ సభ్యులు ముంబయిలో ఉన్నట్టు చెప్పారు. తన ఇంటి వద్ద కరెంటు కోతలను భరించలేక కోపంతోనే యువకుడు పోలీసులను తప్పుదారిపట్టించేందుకు ఇలా కాల్‌ చేశాడని పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని