Chandigarh: ‘టూవీలర్‌కు రెండు లీటర్లు..ఫోర్‌ వీలర్‌కు ఐదు లీటర్లు’: ట్రక్కు డ్రైవర్ల నిరసన వేళ ఆంక్షలు

Drivers Protest: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల నిరసన వేళ.. చండీగఢ్‌ యంత్రాంగం ఇంధన విక్రయాలపై ఆంక్షలు విధించింది. 

Published : 02 Jan 2024 20:26 IST

చండీగఢ్‌: భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనతో దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు (Truck drivers strike) నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌ల ముందు బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితులు మరింత తీవ్రంగా కాకూడదనే ఉద్దేశంతో చండీగఢ్‌ స్థానిక యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. తక్షణమే అమల్లోకి వచ్చేలా పెట్రోల్‌, డీజిల్ విక్రయాలపై రేషన్ విధించింది.

దాంతో ద్విచక్రవాహనదారులు రెండు లీటర్లు లేక గరిష్ఠంగా రూ. 200 వరకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేసే వీలుంది. అలాగే నాలుగు చక్రాల వాహనదారులు ఐదు లీటర్లు లేక గరిష్ఠంగా రూ.500 వరకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేసేలా తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. ఈ అంతరాయం వేళ.. అందరికీ ఇంధనం అందుబాటులో ఉంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చండీగఢ్‌ పాలనా యంత్రాంగం వెల్లడించింది. ఈ ఆంక్షలను బంక్‌ నిర్వాహకులు పాటించాలని, వారికి ప్రజలు సహకరించాలని కోరింది.

‘ఏమిటీ ‘హిట్‌-అండ్‌-రన్‌’ నిబంధన? డ్రైవర్లలో ఎందుకింత ఆందోళన?’

 ట్రక్కు డ్రైవర్ల నిరసనలతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాహనదారుల్లో ఆందోళన కొనసాగుతోంది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌, థానె, జల్‌గావ్‌, ధూలియాలో ఇంధనం కోసం బారులు తీరిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, లద్దాఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. భారీగా డిమాండ్ రావడంతో కొన్ని బంక్‌లు నిండుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాహనాదారులు ఆందోళనకు గురికావొద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తగినంత ఇంధనం అందుబాటులో ఉందని వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని