తనిఖీలా..? తొలగింపా..?: ప్రతిమ హత్య కేసులో అనుమానాలు..

Karnataka: ప్రభుత్వ అధికారిణి దారుణ హత్య కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఆమె ఇటీవలే కొన్ని ప్రాంతాల్లో సోదాల్లో పాల్గొన్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 

Updated : 06 Nov 2023 12:47 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka) గనులు, భూవిజ్ఞాన శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న కేఎస్‌ ప్రతిమ(Prathima) హత్య ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఆమె తోటి సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఆమె డైనమిక్ లేడీ అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కర్ణాటక పర్యావరణ విభాగం సీనియర్‌ అధికారి దినేశ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఆమె మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె చాలా డైనమిక్‌గా ఉంటారు. సోదాలపరంగా, నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కూడా కొన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఆమెకు శత్రువులు ఎవరూ లేరు’ అని వెల్లడించారు. అధికారి వ్యాఖ్యలతో ఇటీవల జరిపిన తనిఖీలే ప్రతిమ హత్యకు కారణమయ్యాయా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

రామనగర జిల్లాలో పని చేస్తున్న కేఎస్‌ ప్రతిమ(Prathima) బదిలీపై ఇటీవలే బెంగళూరు(Bengaluru)కు వచ్చారు. విధులు ముగించుకుని దొడ్డకల్లసంద్ర గోకుల్‌ అపార్ట్‌మెంట్‌కు రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు ఊపిరి ఆడకుండా చేసిన నిందితుడు, గొంతుకోసి హత్య చేశాడని గుర్తించినట్లు తెలిపారు. ఐదేళ్ల నుంచి ఆమె ఒక్కరే ఫ్లాట్లో ఉంటున్నారని చెప్పారు. అసలేం జరిగిందో తెలిసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

అధికారితోనే పంట వ్యర్థాలు దగ్ధం చేయించిన రైతులు

ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తన సోదరి స్పందించకపోవడంతో ఆమె సోదరుడు ప్రతీక్‌, దిగువ అంతస్తులో ఉన్న వారికి ఫోన్‌ చేశారు. వారు వచ్చి చూసేసరికి ప్రతిమ హత్యకు గురైందని శనివారం అర్ధరాత్రి తెలిసింది. ఈ హత్యకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా తుడకి గ్రామానికి చెందిన ప్రతిమకు 18 ఏళ్ల క్రితమే సత్యనారాయణతో వివాహమైంది. భర్త, ఆమె కుమారుడు తీర్థహళ్లిలో ఉంటున్నారని ప్రతీక్‌ తెలిపారు.

డ్రైవర్‌ అరెస్టు..

అధికారిణి హత్య కేసుకు సంబంధించి, తొలి అరెస్టు చోటుచేసుకుంది. ‘ఈ హత్యకేసులో అనుమానితుడిని అరెస్టు చేశాం. అతడు ఒక డ్రైవర్‌. ఇటీవలే అతడిని పని నుంచి తొలగించారు’ అని బెంగళూరు పోలీసు కమిషనర్ వెల్లడించారు. తనను పని నుంచి తొలగించడం వల్లే హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. దీంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు