Amit Shah: చైనా నుంచి కాంగ్రెస్‌ సంస్థకు డబ్బులు : అమిత్‌ షా

లోక్‌సభలో (Lok Sabha) ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. 

Updated : 13 Dec 2022 13:44 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) నిప్పులు చెరిగారు. లోక్‌సభలో (Lok Sabha) ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని మండిపడ్డారు. చైనాపై సరిహద్దు వివాదంపై మాట్లాడిన ఆయన.. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నారు. మరోవైపు చైనా రాయబార కార్యాలయం (China Embassy) నుంచి కాంగ్రెస్‌ నేతల సంస్థకు డబ్బులు చేరాయని ఆరోపించారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ కోసం ఆ డబ్బులు అందాయన్న అమిత్‌ షా.. మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్కరూ భారత్‌లో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని స్పష్టం చేశారు.

‘సరిహద్దులో భారత్-చైనా బలగాల ఘర్షణపై రక్షణ మంత్రి ప్రకటన చేస్తారని చెప్పినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుంది. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ (Rajiv Gandhi Foundation)కు సంబంధించి ఎఫ్‌సీఆర్‌ఏ రద్దు గురించి వేసిన ప్రశ్న ప్రస్తావనకు రాకుండా ఉండేందుకే సరిహద్దు అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తింది. దీనికి సంబంధించిన సమాధానం కూడా ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. 2005-06, 2006-07 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ రూ.1.35కోట్ల గ్రాంట్‌ పొందింది. అది ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) నిబంధనలకు విరుద్ధం. అందువల్లే దాని రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. చైనామీద నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగానే ఐరాస భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సరిహద్దులో భారత్‌, చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభ(Lok Sabha)లో ప్రకటన చేశారు. మన భూ భాగాన్ని అతిక్రమించేందుకు చైనా సైనికులు చేసిన ప్రయత్నాలను భారత సైనికులు తిప్పికొట్టారని అన్నారు. ఇందులో భారత సైనికులెవ్వరూ చనిపోలేదని, ఎవ్వరికీ తీవ్ర గాయాలు కాలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని