ISRO: కొత్త ఏడాది తొలిరోజే ప్రయోగం.. పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్‌ షురూ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 2024 కొత్త ఏడాది తొలి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది.

Updated : 31 Dec 2023 11:14 IST

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 2024 కొత్త ఏడాది తొలి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించి సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (శ్రీహరికోట)లో కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది.

ఎక్స్‌పోశాట్‌ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుంది. ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ లక్ష్యం. ఈ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లు. పీఎస్‌ఎల్‌వీ చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది. దీనికి పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌(పీవోఈఎం) అని నామకరణం చేశారు.

మరోవైపు పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి58, ఎక్స్‌పోశాట్‌ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి నారాయణ రాణె సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని