కొవిడ్‌ టీకాతో..ప్రపంచాన్ని రక్షించిన భారత్‌!

దేశంలో కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తేవడంతో పాటు అంతర్జాతీయ సంస్థల ఒప్పందంతో వివిధ దేశాలకు టీకాను ఎగుమతి చేస్తోన్న భారత్ మహమ్మారి బారినుంచి ప్రపంచాన్ని రక్షించిందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.

Published : 07 Mar 2021 20:36 IST

అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం

హూస్టన్‌: దేశంలో కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తేవడంతో పాటు అంతర్జాతీయ సంస్థల ఒప్పందంతో వివిధ దేశాలకు భారత్‌ టీకాను ఎగుమతి చేస్తోంది. తద్వారా మహమ్మారి బారినుంచి యావత్ ప్రపంచాన్ని భారత్ రక్షించిందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్‌ చేస్తోన్న కృషిని తక్కువ అంచనా వేయొద్దని అమెరికా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘కొవిడ్‌ వ్యాక్సినేషన్‌-సాధారణ స్థితులు’ అనే అంశంపై ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐఏసీసీజీహెచ్‌) ఏర్పాటు చేసిన ఓ వెబినార్‌లో ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ హోటెజ్‌ విదేశాలకు వ్యాక్సిన్‌ అందించడంలో భారత్‌ పాత్రను వివరించారు.

‘వైద్యశాస్త్రంలో ఉన్న అనుభవంతో ప్రపంచంలోనే ఫార్మసీ దేశంగా భారత్‌ పిలవబడుతోంది. అంతేకాకుండా ఔషధ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న దేశం నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకెళ్లేందుకు ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి. ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతో అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అవి ప్రభావం చూపలేకపోయాయి. కానీ, భారత్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌లను అంతర్జాతీయ సంస్థల ఒప్పందాలతో అల్ప, మధ్య ఆదాయా దేశాలకు అందిస్తూ ప్రపంచాన్ని రక్షిస్తోంది’ అని అమెరికాలోని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ హోటెజ్‌ పేర్కొన్నారు. ఇలా వ్యాక్సిన్‌ అందించడం నిజంగా ప్రపంచ దేశాలకు గొప్ప బహుమతి అని అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాక్సిన్‌ల ప్రభావం సమయంపై స్పష్టత లేనందున కొత్తరకం వైరస్‌లను ఎదుర్కొనేందుకు బూస్టర్‌ డోసులు అవసరం ఉందని పీటర్‌ హోటెజ్‌ తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం దేశంలోనే పంపిణీ చేయడమే కాకుండా విదేశాలకూ వ్యాక్సిన్‌ను భారీ మొత్తంలో ఎగుమతి చేస్తోంది. ఇక పొరుగున ఉన్న దేశాలకు ఉచితంగా పంపిణీ చేసింది. వీటితోపాటు వాణిజ్య పరంగానూ దాదాపు 50కిపైగా దేశాలకు భారత్‌ నుంచే వ్యాక్సిన్‌ ఎగుమతి చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలాఉంటే, భారత్‌లో ఇప్పటివరకు రెండు కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని