దేశాన్ని తప్పుదోవ పట్టించడం సరైనదేనా: మోదీ

పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్రమోదీ వాటిపై గురువారం మండిపడ్డారు. పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు.

Published : 07 Feb 2020 00:45 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్రమోదీ గురువారం మండిపడ్డారు. పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా సీఏఏ నిరసనలను ఉద్దేశిస్తూ.. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సరైనదేనా అంటూ ప్రతిపక్షాలు అవలంబిస్తున్న విధానాన్ని ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు మద్దతుగా అప్పట్లో రామ్‌ మనోహర్‌ లోహియా, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో తీవ్రవాదులు పాల్గొంటున్నారని కేరళ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ.. మరి దిల్లీలో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక నిరసనలకు వామపక్షవాదులు ఎలా మద్దతు పలుకుతారని ఆయన మండిపడ్డారు. నిరసనల పేరుతో ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ విమర్శించారు.

జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌) గురించి మోదీ ప్రస్తావిస్తూ.. ఈ ప్రక్రియ ద్వారా లబ్దిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందటానికి వీలుంటుదన్నారు. జనాభా గణన, ఎన్‌పీఆర్‌ ఈ రెండు ప్రక్రియలు గతంలోనూ సర్వసాధారణంగానే జరిగాయి. కానీ ఇప్పుడు ఎందుకు వివాదాస్పదమవుతున్నాయని ప్రశ్నించారు. ఎన్‌పీఆర్‌లో అడిగే ప్రశ్నలన్నీ పరిపాలనకు సంబంధించినవేనన్నారు. ఈ విషయాల్ని రాజకీయం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించకండి అని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని