Modi: మునుపటి నష్టాన్ని పూడ్చేలా అనుసంధాన మహాయజ్ఞం

మునుపటి ప్రభుత్వ హయాంలో ఉత్తరాఖండ్, దేశం నష్టపోయిన పదేళ్ల కాలం భర్తీ అయ్యేలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనుసంధాన మహాయజ్ఞాన్ని 

Published : 05 Dec 2021 10:19 IST

అందులో భాగంగానే రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులు
ఉత్తరాఖండ్‌ బహిరంగ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

దేహ్రాదూన్‌: మునుపటి ప్రభుత్వ హయాంలో ఉత్తరాఖండ్, దేశం నష్టపోయిన పదేళ్ల కాలం భర్తీ అయ్యేలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనుసంధాన మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక పరేడ్‌ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. గఢ్‌వాలీలో ప్రసంగాన్ని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘‘ఈ రోజు ఇక్కడ ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ‘మహాయజ్ఞం’లో భాగం. నష్టపోయిన కాలాన్ని భర్తీచేసేందుకు మేం రెండు, మూడు రెట్ల వేగంతో చర్యలు చేపడుతున్నాం’’ అని అన్నారు. కేదార్‌నాథ్‌లో గతంలో చేప్పిన అంశాన్ని పునరుద్ఘాటించిన మోదీ.. ప్రస్తుత దశాబ్దం ఉత్తరాఖండ్‌ది అవడానికి ఈ ప్రాజెక్టులు ఉపకరిస్తాయన్నారు.

తమ ప్రభుత్వం కేదార్‌నాథ్‌లో చేపట్టిన పునర్నిర్మాణ పనుల కారణంగా 2019లో ఆ ఆలయానికి రికార్డుస్థాయిలో పది లక్షల మందికిపైగా భక్తులు విచ్చేశారని చెప్పారు. శనివారం శంకుస్థాపన చేసిన దిల్లీ-దేహ్రాదూన్‌ ఆర్థిక నడవా కారణంగా రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గుతుందన్నారు. ఇందులో భాగంగా ఆసియాలోనే అతిపెద్దదైన 12 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తున్నారు. ఫలితంగా వన్యప్రాణుల కదలికలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి మునుపటి ప్రభుత్వాలు చేసిందా చాలా స్వల్పమని, తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక గత ఏడు సంవత్సరాల్లో రూ.12,000 కోట్లు ఖర్చు చేశామని మోదీ చెప్పారు. ‘‘ఉత్తరాఖండ్‌ అభివృద్ధి రెండు ఇంజిన్ల ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశం. రాష్ట్ర అభివృద్ధి కోసం మేం రూ.లక్ష కోట్లకుపైగా ప్రాజెక్టులను మంజూరు చేశాం’’ అని వివరించారు. రిషీకేశ్‌లోని లక్ష్మణ్‌ ఝూలా సమీపంలో వంతెన నిర్మాణానికీ మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్‌ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని