జూన్‌ నుంచి 9-14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా!

జాతీయ రోగనిరోధకత కార్యక్రమంలో భాగంగా జూన్‌ నుంచి 9-14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాను అందించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Published : 30 Jan 2023 04:50 IST

జాతీయ రోగనిరోధకత కార్యక్రమంలో చోటు
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు..  

దిల్లీ: జాతీయ రోగనిరోధకత కార్యక్రమంలో భాగంగా జూన్‌ నుంచి 9-14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాను అందించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణలో కీలకమైన ఈ టీకాకు సంబంధించి 16.02 కోట్ల డోసుల సరఫరా కోసం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఏప్రిల్‌లో గ్లోబల్‌ టెండర్లను పిలవనున్నట్లు వెల్లడించాయి. ఇందులో భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ సంస్థతోపాటు అంతర్జాతీయ ఉత్పత్తిదారు మెర్క్‌ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. 2026 కల్లా వీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. సీరం సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ‘సెర్వావాక్‌’ టీకాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 24న ఆవిష్కరించారు. సెర్వావాక్‌కు గత సంవత్సరం జులైలో డీసీజీఐ అనుమతి లభించింది. టీకాలపై జాతీయ సాంకేతిక సలహా బృందం కూడా దీన్ని ఆమోదించింది. దేశంలో అంతర్జాతీయ టీకాల ధర ఒక్కో డోసుకు రూ.4వేల వరకు ఉండగా, సెర్వావాక్‌ సుమారు రూ.200-400కే లభ్యమవుతుందని సీరం సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా గతంలో వెల్లడించారు. ప్రపంచంలోని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కేసుల్లో నాలుగోవంతు, ఆ క్యాన్సర్‌ సంబంధ మరణాల్లో మూడోవంతు మన దేశంలోనే వెలుగుచూస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు