అదానీపై అట్టుడికిన సభ

అదానీ గ్రూపునకు సంబంధించి హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక దరిమిలా ఆ కంపెనీ షేర్లు పతనం కావడంపై, దాని వ్యాపార లావాదేవీలపై సమగ్ర విచారణకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ (జేపీసీ)ని నియమించాలని పార్లమెంటులో విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి.

Updated : 03 Feb 2023 09:04 IST

జేపీసీ నియామకానికి పార్లమెంటులో విపక్షం పట్టు
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి: కాంగ్రెస్‌
హిండెన్‌బర్గ్‌ నివేదిక మీద స్తంభించిన లోక్‌సభ, రాజ్యసభ
వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన 9 పార్టీల్లో కాంగ్రెస్‌, భారాస

దిల్లీ: అదానీ గ్రూపునకు సంబంధించి హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక దరిమిలా ఆ కంపెనీ షేర్లు పతనం కావడంపై, దాని వ్యాపార లావాదేవీలపై సమగ్ర విచారణకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ (జేపీసీ)ని నియమించాలని పార్లమెంటులో విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. ఈ గ్రూపు షేర్లలో అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అదానీ వ్యవహారం వల్ల జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ), ప్రభుత్వరంగ బ్యాంకులు ఆ గ్రూపులో పెట్టిన పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనయ్యాయని కాంగ్రెస్‌తో పాటు శివసేన, వామపక్షాలు, భారాస, ఆప్‌ తదితర పార్టీల సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్‌పై చర్చకంటే ముందు ఈ అంశాన్ని పరిశీలించాలంటూ కార్యకలాపాలను అడ్డుకోవడంతో ఉభయసభలు స్తంభించిపోయాయి. ఎలాంటి చర్చ చేపట్టకుండానే శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ సమావేశమైన తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అదానీపై ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ నివేదిక గురించి కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సభాపతి వాటిని అంగీకరించలేదు. ఆధార రహిత ఆరోపణలతో సభ్యులు కీలకమైన ప్రశ్నోత్తరాల గంటకు అంతరాయం కలిగించొద్దని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ముకుళిత హస్తాలతో విజ్ఞప్తి చేశారు. వెల్‌ వద్దకు దూసుకువచ్చిన ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను స్పీకర్‌ వాయిదా వేశారు.

వాయిదా తీర్మానానికి నిర్ణీత నమూనా ఏమీ లేదు: కేశవరావు

రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అదానీ వ్యవహారంపై చర్చించాలని 267 నిబంధన కింద మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్‌), ప్రియాంక చతుర్వేది (శివసేన), సంజయ్‌సింగ్‌ (ఆప్‌), కె.కేశవరావు (భారాస) సహా 9 మంది సభ్యులు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. అవి నిబంధనలకు లోబడి లేవని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు. ఈ తీర్మానాలకు నిర్ణీత నమూనా అంటూ లేదని కేశవరావు చెప్పారు. అదానీ అంశం కంటే దేశంలో పెద్ద విషయం మరొకటి లేదన్నారు. సభ ఒకసారి వాయిదాపడి తిరిగి సమావేశమయ్యాకా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. లక్షల మంది చిన్న మదుపరుల కష్టార్జితంపై, ప్రభుత్వ సంస్థల పెట్టుబడులపై ప్రభావం చూపిన అంశాన్ని చర్చకు చేపట్టడానికి సభా కార్యకలాపాలను పక్కనపెట్టాలని డిమాండ్‌ చేశారు. సభాపతి ప్రతిసారి తమ నోటీసులను తిరస్కరిస్తుండడంతో ఈసారి అన్ని పార్టీలూ కలిసి వాటిని ఇచ్చాయని ఖర్గే చెప్పారు.


6న జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు

దిల్లీ: అదానీ కంపెనీల విషయంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ తెలిపారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు సూచనలు ఇవ్వాల్సిందిగా పీసీసీలను కోరినట్లు చెప్పారు. ప్రధానికి సన్నిహితులైన మిత్రుల కోసం ప్రజల కష్టార్జితాన్ని పణంగా పెట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. ‘‘నైతికత గురించి అదానీ మాట్లాడటం.. ఆయన గురువు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) వినయం, నిగ్రహం, విశాల హృదయం వంటి సద్గుణాలను బోధించడం లాంటిదే. ఇదంతా పొలిటికల్‌ సైన్స్‌’’ అంటూ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ప్రజాధనం ప్రమాదంలో పడింది
విపక్ష సభ్యుల ఆరోపణ

ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో కలిసి ప్రతిపక్ష నేతలు విలేకరులతో మాట్లాడారు. ‘ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కోట్లమంది ప్రజల పెట్టుబడులున్నాయి. వారి సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడింది’ అని ఆరోపించారు. పార్లమెంటు సమావేశం మొదలు కావడానికి ముందు విపక్షాలు భేటీ అయి, సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని చర్చించాయి. ఆ ప్రకారమే ఉభయ సభల్ని స్తంభింపజేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని