మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ చూపనక్కర్లేదు

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం ప్రకటించింది.

Updated : 01 Apr 2023 05:54 IST

సీఐసీ ఆదేశాలు కొట్టేసిన గుజరాత్‌ హైకోర్టు
కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా  

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఆ సమాచారం ఇవ్వాలంటూ ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది. ఈ కేసులో సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగ పరిచారంటూ కక్షిదారు అరవింద్‌ కేజ్రీవాల్‌కు రూ.25 వేలు జరిమానా విధించింది. ఆయన పిటిషన్‌ ప్రజాప్రయోజనాల కంటే రాజకీయ ప్రేరేపితమైందని వ్యాఖ్యానించింది. ఆ సొమ్మును 4 వారాల్లోగా గుజరాత్‌ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బిరేన్‌ వైష్ణవ్‌ తీర్పిచ్చారు.  

ఇదీ జరిగింది..

2016 ఏప్రిల్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌.. సీఐసీ ఛైర్మన్‌కు ఓ లేఖ రాశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం మోదీ విద్యార్హతలకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరారు. దీనిపై స్పందించిన అప్పటి సీఐసీ ఛైర్మన్‌ ఎం.శ్రీధర్‌ ఆచార్యులు.. గుజరాత్‌ యూనివర్సిటీకి, దిల్లీ యూనివర్సిటీకి ఆదేశాలు జారీచేశారు. మోదీ విద్యార్హతలకు సంబంధించిన రికార్డులను కేజ్రీవాల్‌కు ఇవ్వాలని సూచించారు. ఆ ఆదేశాలపై.. గుజరాత్‌ యూనివర్సిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించింది. కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశాలపై స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆదేశాల్ని పక్కనబెడుతూ.. కేజ్రీవాల్‌కు జరిమానా విధించింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా గుజరాత్‌ యూనివర్సిటీ తరఫున వాదనలు వినిపించారు. మోదీ విద్యార్హతలను దాచిపెట్టాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఆ వివరాలు ఇప్పటికే పబ్లిక్‌ డొమైన్‌లో, యూనివర్సిటీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. ఆ పత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేవని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న గుజరాత్‌ హైకోర్టు.. ఈ తీర్పు వెలువరించింది.

ప్రధాని మోదీ 1978లో గుజరాత్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, 1983లో దిల్లీ యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తిచేశారు.

‘ప్రధాన మంత్రి ఏం చదువుకున్నారో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? డిగ్రీ సర్టిఫికెట్‌ చూపించాలన్న ఆదేశాలను ఆయన కోర్టులో ఎందుకు వ్యతిరేకించారు? డిగ్రీ పట్టా చూపించాలని అడిగిన వారికి జరిమానా వేస్తారా? అసలు ఏం జరుగుతోంది? చదువులేని లేదా విద్య తక్కువ ఉన్న ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని