Bengaluru rains: ఆమె చీర.. ఐదుగురి ప్రాణాలు నిలిపింది

కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగితే చూసీ చూడనట్లు తప్పించుకుని పోయే వాళ్లను ఎందరినో చూస్తుంటాం. మరి కొందరు అంబులెన్స్‌, పోలీసులకు ఫోను చేయాలని యత్నిస్తారే తప్ప రంగంలోకి దిగి సాయం చేయాలన్న ఆలోచన చేయరు.

Updated : 23 May 2023 07:39 IST

ఈనాడు, బెంగళూరు: కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగితే చూసీ చూడనట్లు తప్పించుకుని పోయే వాళ్లను ఎందరినో చూస్తుంటాం. మరి కొందరు అంబులెన్స్‌, పోలీసులకు ఫోను చేయాలని యత్నిస్తారే తప్ప రంగంలోకి దిగి సాయం చేయాలన్న ఆలోచన చేయరు. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల వల్ల.. ఆదివారం కేఆర్‌ కూడలి సమీప అండర్‌ పాస్‌లో పొంగుకొచ్చిన నీటిలో మునిగి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భానురేఖ అనే టెకీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో చిక్కుకుంది ఆరుగురైతే మృతి చెందింది ఒకరు. మిగిలిన ఐదుగురిని ప్రాణాపాయం నుంచి కాపాడింది బీబీఎంపీ రక్షణ బృందం. ఆ రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి వచ్చేంత వరకు వారి ప్రాణాలను కాపాడింది మాత్రం ఓ మహిళ చీర. స్థానిక కేఆర్‌ కూడలిలోని అండర్‌ పాస్‌ వద్ద ఏదో గొడవగా ఉందని అదే మార్గంలో వెళ్తున్న ఓ మహిళ(42) గుర్తించింది. అండర్‌ పాస్‌లో నిండిన నీటిలో మీడియా ప్రతినిధి ఒకరు ఈత కొడుతూ మునిగిన కారులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వారిని రక్షించేందుకు తాడు అవసరమైంది. ఎవరైనా ఏదైనా అందించాలని ఆ యువకుడు కోరాడు. అందరూ చూస్తున్నారే తప్ప అతనికి ఏదైనా ఆధారాన్ని అందించాలనే ప్రయత్నం చేయలేదు. ఆ మహిళ తన చీరను విప్పి ఆ యువకుడికి అందించింది. అండర్‌ పాస్‌కు ఉన్న ఇనుప ఊచలకు కట్టిన ఆ చీరతో ఒక్కొక్కరుగా బయటకు రాగలిగారు. ఆ మహిళ చూపిన తెగువకు అక్కడి వారంతా అభినందించారు. మరో మహిళ తన వద్ద ఉన్న దుపట్టాను ఆమెకు అందించగా.. మరో వ్యక్తి తన చొక్కాను విప్పి ఆ మహిళకు ఇచ్చాడు. ఆ క్షణంలో మహిళ అందించిన చీర ఐదుగురి ప్రాణాలను నిలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని