కోడ్‌ మీరితే కొరడా!

భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి.

Published : 18 Mar 2024 05:21 IST

నిష్పక్షపాత ఎన్నికలకు పాశుపతాస్త్రం

భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. ప్రలోభాల పర్వాలు, ప్రత్యర్థులపై దాడులు, దుర్భాషలు, రెచ్చగొట్టే వ్యవహారశైలి వంటివి అడుగడుగునా కనిపిస్తుంటాయి. నిష్పక్షపాత ఎన్నికలకు ఇవి ప్రధాన అడ్డంకులు. వీటి పాలిట పాశుపతాస్త్రమే ఎన్నికల నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌)! ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం మధ్యాహ్నం పోల్‌ షెడ్యూలు ప్రకటించగానే దేశవ్యాప్తంగా ఈ కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. ఓట్ల లెక్కింపు ముగిసేవరకూ అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీలన్నీ దీన్ని తు.చ. తప్పకుండా పాటించాల్సిందే. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ఎన్నికల ప్రక్రియకు ప్రాణాధారమైన ఈ నియమావళి కథాకమామీషును ఓసారి పరిశీలిస్తే..  

ఎందుకీ నియమావళి?

ఎన్నికల ప్రచారం, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, సక్రమంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఈ నియమావళిని అమలు చేస్తారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఇది నిరోధిస్తుంది. తద్వారా అభ్యర్థులందరికీ సమానావకాశాలు దక్కేలా చూడటం దీని ఉద్దేశం.

చట్టబద్ధత కోసం..

ఎన్నికల నియమావళిని నిర్దేశించే ప్రత్యేక చట్టమేమీ లేదు. అయితే, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కోడ్‌ను సమర్థించింది. ఈసీ తన అధికారాలను సమర్థంగా ఉపయోగించుకోవడానికి వీలుగా ‘కోడ్‌’కు చట్టబద్ధత కల్పించాలని 2013లో పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిపై మరింత స్పష్టత కోసం సవరణ చేయాలని సూచించింది. ఎన్నికల వివాదాలను 12 నెలల్లోగా పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చెప్పింది.

అమలు ఎలా?

రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించే అధికారం ఎన్నికల  కమిషన్‌కు ఉంటుంది. కోడ్‌ అమలుకూ.. ఈ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలనే ఈసీ ఉపయోగించుకుంటోంది.

  • కోడ్‌ ఉల్లంఘనలపై ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. న్యాయస్థానాలనూ ఆశ్రయించొచ్చు.
  • పరిశీలకులు, కొన్ని యంత్రాంగాల ద్వారా ఈసీ ఈ నిబంధనల అమలును పరిశీలిస్తుంది. ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తుంది.

ఉల్లంఘిస్తే..

నియమావళిని ఉల్లంఘించిన వారికి ఈసీ నోటీసు పంపుతుంది. కొన్ని విషయాల్లో వారు క్షమాపణ చెబితే వదిలేస్తుంది. నాయకులను మందలించడం, ప్రచారానికి వెళ్లకుండా నిలువరించడం వంటి చర్యలను తీసుకుంటుంది. తీవ్రతను బట్టి కేసుల నమోదుకూ ఆదేశాలిస్తుంది.


ఇలా నడుచుకోవాలి

సభలు: తగిన భద్రత ఏర్పాట్లు చేయడానికి వీలుగా సభలు నిర్వహించే ప్రదేశాలు, సమయం వంటి వివరాలను పోలీసులకు ముందే తెలపాలి.

ప్రదర్శనలు: ఇద్దరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్గంలో ప్రదర్శన జరపాలని భావిస్తే.. సంబంధిత నిర్వాహకులు మొదటే చర్చించుకోవాలి. ఘర్షణలకు తావివ్వకూడదు.

పోలింగ్‌ రోజున: పోలింగ్‌ బూత్‌ వద్ద విధులు నిర్వర్తించే పార్టీల కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇస్తారు. వాటిపై పార్టీ పేరు, గుర్తు, అభ్యర్థి పేరు ఉండకూడదు.

అధికార పార్టీ: ఓటర్లను ప్రభావితం చేసే ఏ ప్రాజెక్టు, పథకాన్ని ప్రకటించకూడదు. మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను ఎన్నికల వ్యవహారంతో ముడిపెట్టకూడదు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోకూడదు.

  • ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగయ్యేలా ప్రభుత్వ విజయాలపై ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రభుత్వ ప్రసార సాధనాలు, వాహనాలను ఉపయోగించుకోకూడదు. ఆర్థిక సంబంధమైన హామీలను ఇవ్వకూడదు.
  • ప్రభుత్వ వసతి గృహాలు, హెలిప్యాడ్‌ల వంటి సౌకర్యాలను అన్ని పార్టీలవారికీ కల్పించాలి.
  • ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు, పదోన్నతులు ఇవ్వకూడదు.

కేరళలో బీజాలు

తొలిసారిగా 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘విధులు- నిషేధాలు’ పేరుతో కొన్ని నిబంధనలను అక్కడి పాలనా యంత్రాంగం అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత 60 ఏళ్లలో అది మార్పులకు లోనవుతూ ప్రస్తుత ‘నియమావళి’ రూపాన్ని సంతరించుకొంది.

  • 1962లో లోక్‌సభకు, కొన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు.. గుర్తింపు పొందిన పార్టీలకు ప్రవర్తనా నియమావళిని ఈసీ పంపింది. వీటికి అన్ని పార్టీల అంగీకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
  • 1968లో ‘కనీస ప్రవర్తనా నియమావళి’ పేరుతో మార్గదర్శకాలను ఈసీ అందజేసింది.
  • 1971-72లో లోక్‌సభ, అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల సందర్భంగా మరోసారి నియమావళిని అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం పంపింది.
  • 1974 ఎన్నికల సందర్భంగా నియమావళి అమలుపై ఈసీ కీలక నిర్ణయం తీసుకొంది. దీనిని అన్ని పార్టీలు కచ్చితంగా పాటించేలా చూడడానికి, ఉల్లంఘనలను గుర్తించడానికి.. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన, అన్ని పార్టీల ప్రతినిధులు సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.
  • 1977 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మరోసారి అన్ని పార్టీలకు నియమావళిని ఈసీ పంపింది.
  • 1979లో.. అధికార పార్టీ అభ్యర్థులు తమ హోదాలను దుర్వినియోగం చేయకుండా నియమావళిలో కొత్త విభాగాన్ని చేర్చింది.
  • 1991లో నిబంధనలన్నింటినీ క్రోడీకరించి, ప్రస్తుతం అమల్లో ఉన్న నియమావళిని రూపొందించింది.
  • ఎన్నికల ప్రణాళికలనూ నియమావళి పరిధిలోకి తెస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు 2013లో ఆదేశించింది. ఈ మేరకు వాటిని కూడా ‘కోడ్‌’ పరిధిలోకి తెస్తూ 2014లో ఈసీ నిర్ణయం తీసుకుంది.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని