సంక్షిప్త వార్తలు (5)

కబేళాలు, మాంసం ప్రాసెసింగ్‌ యూనిట్లను ‘పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2006’ పరిధిలోకి చేర్చాల్సిన అవసరం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Updated : 19 Mar 2024 06:16 IST

కబేళాలను ‘ఈఐఏ’ పరిధిలోకి చేర్చనవసరంలేదు: కేంద్రం

దిల్లీ: కబేళాలు, మాంసం ప్రాసెసింగ్‌ యూనిట్లను ‘పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2006’ పరిధిలోకి చేర్చాల్సిన అవసరం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కబేళాల వద్ద అధిక నీటి వినియోగం, కలుషితానికి దారితీసే ఘన వ్యర్థాలను పారవేయడం వల్ల జూనోటిక్‌ వ్యాధులు సంక్రమిస్తున్నాయని జంతుహక్కుల కార్యకర్త గౌరీ మౌలేఖి  ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సంబంధిత అంశంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎన్జీటీకి అఫిడవిట్‌ సమర్పించింది. కబేళాలు, మాంసం ప్రాసెసింగ్‌ యూనిట్లను నియంత్రించేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఇప్పటికే అమలులో ఉన్నందున ‘ఈఐఏ-2006’ పరిధిలో వాటిని చేర్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. భారత ఆహారభద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు పాటించిన కబేళాలకే లైసెన్సులు అందేలా చూడాలని కేంద్రం స్పష్టం చేసింది.


కేరళ సాహితీవేత్త ప్రభా వర్మకు సరస్వతీ సమ్మాన్‌ పురస్కారం

దిల్లీ: ప్రముఖ కేరళ కవి, సాహితీవేత్త ప్రభా వర్మ 2023 ఏడాదికి గాను సరస్వతీ సమ్మాన్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. మలయాళంలో ఆయన రచించిన ‘రౌద్ర సాత్వికం’ నవల ఈ అవార్డు దక్కేలా చేసిందని నిర్వాహక సంస్థ కె.కె.బిర్లా ఫౌండేషన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ 22 భాషల్లోని రచనలను పరిశీలించిన తర్వాత ప్రభా వర్మ నవలను పురస్కారానికి ఎంపిక చేసింది.


అగస్టావెస్ట్‌ల్యాండ్‌ కేసు... బెయిల్‌ అభ్యర్థనపై విచారణకు సుప్రీం నిరాకరణ

దిల్లీ: అత్యంత ప్రముఖుల కోసం వినియోగించే 12 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన అగస్టావెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంలో నిందితుడైన క్రిస్టియన్‌ మిషెల్‌ జేమ్స్‌ తాజాగా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గతంలోనూ ఇటువంటి పిటిషన్‌ను తిరస్కరించామని ధర్మాసనం స్పష్టం చేసింది.


మళ్లీ తిహాడ్‌ జైలుకు సత్యేందర్‌ జైన్‌

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ వైద్యశాఖ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు గత ఏడాది మే నెలలో వైద్య కారణాలతో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్‌ బెయిల్‌గా మార్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. వెంటనే లొంగిపోవాల్సిందిగా జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం సోమవారం ఆదేశించింది. దీంతో ఆయన సోమవారం తిహాడ్‌ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.


బిల్కిస్‌ బానో కేసులో... ఖైదీల ముందస్తు విడుదల రద్దునుసుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన మరో దోషి

దిల్లీ: జైలు నుంచి ముందుగా విడుదల చేయడాన్ని రద్దు చేసిన జనవరి 8నాటి తీర్పును సవాల్‌ చేస్తూ బిల్కిస్‌ బానో కేసులో దోషి అయిన మరో వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ తీర్పును పునఃసమీక్షించాలని రమేశ్‌ రూపాభాయ్‌ చందన తన పిటిషన్‌లో కోరారు. గుజరాత్‌ ప్రభుత్వం, మరో ఇద్దరు దోషులు కూడా జనవరి 8నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ  ఇప్పటికే పిటిషన్లు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని