వివక్షతో ఉద్యోగాలు నిరాకరించొద్దు

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ట్రాన్స్‌జెండర్లపై వివక్ష ఉండకూడదని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Published : 19 Mar 2024 03:43 IST

ట్రాన్స్‌జెండర్లకు సమాన అవకాశాలు కల్పించాలి
పనిప్రదేశాల్లో వేధింపులకు గురిచేస్తే చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ట్రాన్స్‌జెండర్లపై వివక్ష ఉండకూడదని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పనిప్రదేశాల్లో వేధింపుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు వారి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది. ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, భద్రత చట్టం కింద ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రత్యేక విధానం ప్రకటించింది. దీన్ని పనిప్రదేశాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశిస్తూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సంక్షేమాధికారులకు లేఖలు రాసింది. ట్రాన్స్‌జెండర్‌ అన్న కారణంతో వివక్ష చూపి ఉద్యోగాలు ఇవ్వకున్నా, ఉద్యోగం నుంచి తొలగించినా చర్యలు తప్పవని తెలిపింది. విద్యార్హత, సంబంధిత రంగాల్లో నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలతో పాటు సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టంచేసింది. వారు సరైన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా అవసరమైన సహాయ సహకారాల్ని కేంద్ర సామాజిక న్యాయశాఖతో పాటు రాష్ట్రాల్లోని ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖలు అందిస్తాయని తెలిపింది. పనిప్రదేశాల్లో వేధింపులకు గురిచేసినా, అవమానించినా ఫిర్యాదులు స్వీకరిస్తామని... వారి వివరాలను గోప్యంగా పెడతామని వెల్లడించింది. దీని ఆధారంగా పనిప్రదేశాల్లోని కమిటీలు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటారు. ఉద్యోగులుగా కొనసాగుతున్న ట్రాన్స్‌జెండర్ల గుర్తింపు వివరాలపై గోప్యత పాటించాలని, గౌరవానికి భంగం కలిగించవద్దని కేంద్రం పేర్కొంది. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైన సంక్షేమ పథకాలు సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని