పశ్చిమ బెంగాల్‌ డీజీపీపై వేటు

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది.

Updated : 19 Mar 2024 06:15 IST

వెంటనే కొత్త డీజీపీ నియామకం
6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకూ ఉద్వాసన
ఈసీ సంచలన నిర్ణయం

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు సమావేశమై ఈ నిర్ణయాలను తీసుకున్నారు.

ఎన్నికలకు సంబంధంలేని విధులకు డీజీపీ రాజీవ్‌ కుమార్‌ను బదిలీ చేయాలని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. ఆయనకు జూనియర్‌గా ఉన్న అధికారిని డీజీపీగా తాత్కాలికంగా నియమించాలని సూచించింది. డీజీపీ పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లను పంపాలని ఆదేశించింది. దీంతో వెంటనే వివేక్‌ సహాయ్‌ను డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాజీవ్‌ కుమార్‌ను తొలగించిన కొద్ది గంటల్లోనే ఈ నియామకం జరిగింది. ఆ తర్వాత వివేక్‌ సహాయ్‌, సంజయ్‌ ముఖర్జీ, రాజేశ్‌ కుమార్‌ పేర్లను ఎన్నికల సంఘానికి పంపింది. 1988 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన వివేక్‌.. ప్రస్తుతం హోంగార్డ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అండ్‌ కమాండెంట్‌ జనరల్‌గా ఉన్నారు. అయితే 2021 మార్చిలో భద్రతా విభాగం డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వివేక్‌ సహాయ్‌ను ఈసీ సస్పెండు చేయడం గమనార్హం. రాజీవ్‌ కుమార్‌ను ఎన్నికలకు సంబంధం లేని ఐటీ విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది. గతంలోనూ ఎన్నికల సమయంలో రాజీవ్‌ కుమార్‌ రెండు సార్లు ఈసీ ఆదేశాలతో బదిలీ అయ్యారు. 2016లో ఒకసారి, 2019లో మరోసారి ఆయనను ఎన్నికలకు సంబంధం లేని విధుల్లోకి ఈసీ బదిలీ చేసింది.

అధికారులపైనా..

ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ హోంశాఖల కార్యదర్శులపైనా ఈసీ వేటు వేసింది. వీరంతా ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మరో చోట విధులను నిర్వర్తిస్తున్నారని పేర్కొంది. దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికతకు భంగం కలుగుతుందని భావించినట్లు వెల్లడించింది. ముఖ్యంగా శాంతి భద్రతలు, బలగాల మోహరింపులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పేర్కొంది. సాధారణంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వచ్చినప్పుడు ఈసీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది.

మిజోరం, హిమాచల్‌ ప్రదేశ్‌లలో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులనూ ఎన్నికల సంఘం బదిలీ చేసింది.


మహారాష్ట్రలో వివాదం

మహారాష్ట్రలో పలువురు మున్సిపల్‌ కమిషనర్లను, అదనపు, డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయాలని ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశించగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ.. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌తోపాటు అదనపు, డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయాలని ప్రధాన కార్యదర్శిని సోమవారం ఆదేశించింది. దీంతోపాటు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేసి నివేదిక అందించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని