ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే

ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్‌ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది.

Updated : 19 Mar 2024 06:17 IST

నంబర్లు సహా ఏదీ దాచడానికి వీల్లేదు
21వ తేదీ తుదిగడువు
ఎస్‌బీఐకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
మేం అడిగితేనే వెల్లడిస్తామంటే కుదరదని వ్యాఖ్య
విచారణ సందర్భంగా బ్యాంకు వైఖరిపై రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం

దిల్లీ: ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్‌ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. బాండ్‌ నంబరుతో పాటు కొనుగోలుదారుల సమాచారం, డినామినేషన్లు, వాటిని నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు.. మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. సమాచారమంతా ఇస్తున్నామని, ఏదీ దాచుకోలేదని ఓ ప్రమాణ పత్రం కూడా దాఖలు చేయాలని కూడా బ్యాంకును ఆదేశించింది. ఎస్‌బీఐ నుంచి అందుకున్న డేటాను ఎన్నికల సంఘం వెంటనే తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కూడా ధర్మాసనం పేర్కొంది. ఎస్‌బీఐ అసంపూర్తి సమాచారం ఇవ్వడంపై గత శుక్రవారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్ల ఆల్ఫాన్యూమరిక్‌ నంబర్లు వెల్లడి చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ బ్యాంకుకు నోటీసులిచ్చింది.

దీనిపై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. ‘‘తీర్పులో ‘అన్ని వివరాలు’ అని స్పష్టంగా పేర్కొన్నాం. అంటే బాండ్‌ నంబర్లతో సహా మొత్తం సమాచారం. కానీ మీకేం కావాలో చెప్పండి.. అదే వెల్లడిస్తామన్నట్లు బ్యాంకు ప్రవర్తిస్తోంది. ఈ పద్ధతి సరైంది కాదు’’ అంటూ ఎస్‌బీఐపై తీరుపై ధర్మాసనం మండిపడింది. బ్యాంకు తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే.. పూర్తి సమాచారం వెల్లడించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. వెంటనే ధర్మాసనం ఈ మేరకు ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోపు న్యాయస్థానం ముందు ఎస్‌బీఐ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.

ఆ శక్తి మాకుంది: సీజేఐ

న్యాయస్థానాన్ని కించపరిచేలా కొందరు పత్రికలకు ఇంటర్వ్యూలిస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లోనూ వ్యాఖ్యలు చేస్తున్నారని  సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సీజేఐ డి.వై.చంద్రచూడ్‌ సమాధానమిస్తూ.. వెలువరించిన తీర్పులోని ఆదేశాలను అమలపరచడంపైనే కోర్టు దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. ‘‘న్యాయమూర్తులుగా మేం రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాం. సామాజిక మాధ్యమాల్లో మాపై కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ ఒక సంస్థగా వాటిని తట్టుకోగల శక్తి మాకు ఉంది’’ సీజేఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని