స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్‌పై జై శంకర్‌ స్పందన

సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం  కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్‌పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి.

Updated : 19 Mar 2024 06:28 IST

దిల్లీ: సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం  కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్‌పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. దీనికి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ స్పందించిన తీరు ఆకట్టుకుంటోంది. మాల్టా పతాకంపై వెళుతున్న నౌకను సముద్రపు దొంగలు గతేడాది డిసెంబరులో హైజాక్‌ చేశారు. ఇతర దేశాల నౌకలను దోచుకునేందుకు దానిని మదర్‌ షిప్‌గా ఉపయోగించే ప్రమాదం ఉందని భారత నేవీ గుర్తించింది. దానిని రక్షించేందుకు ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్రలతోపాటు సీ గార్డియన్‌ డ్రోన్లను మోహరించింది. ఆపరేషన్‌లో భాగంగా భారత తీరానికి దాదాపు 2,600 కిలోమీటర్ల దూరంలో వాయుసేన తన ‘సీ-17’ సరకు రవాణా విమానం ద్వారా రెండు చిన్నపాటి యుద్ధ బోట్లను కచ్చితమైన ప్రదేశంలో జారవిడిచింది. మెరైన్‌ కమాండోలూ కిందికి దిగి.. దొంగల ఆటకట్టించారు. మొత్తం 17 మంది బందీలను విడిపించి.. 35 మంది సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నౌక సిబ్బందిలో ఏడుగురు బల్గేరియా జాతీయులు ఉన్నారు. దీనిపై ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి మారియా గాబ్రియెల్‌  ఎక్స్‌ వేదికగా భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అందుకు జై శంకర్‌ స్పందిస్తూ.. ‘స్నేహితులు ఉన్నది అందుకే కదా’ అని బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని