IMA : మీ తీరు తీవ్రంగా బాధిస్తోంది

మూడో ముప్పు పొంచిఉందని, ఎట్టిపరిస్థితుల్లో కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం వద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అభ్యర్థించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ.. ఓ ప్రకటన చేసింది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, అధికార యంత్రాంగాలు వ్యవహరిస్తోన్న తీరు తీవ్రంగా బాధిస్తోందని వ్యాఖ్యానించింది.

Published : 13 Jul 2021 01:13 IST

 ముప్పు పొంచి ఉంది..అలసత్వం వద్దు

దిల్లీ: మూడో ముప్పు పొంచి ఉందని, ఎట్టిపరిస్థితుల్లో కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం వద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అభ్యర్థించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ.. ఓ ప్రకటన చేసింది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, అధికార యంత్రాంగాలు వ్యవహరిస్తోన్న తీరు తీవ్రంగా బాధిస్తోందని వ్యాఖ్యానించింది.

‘మహమ్మారుల చరిత్రను గమనిస్తే.. మూడోముప్పు అనివార్యం. ప్రజలు ఏ మాత్రం కొవిడ్ నియమావళిని పాటించకుండా.. గుంపులుగా చేరడం తీవ్రంగా బాధిస్తోంది. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. విహార, ఆధ్యాత్మిక యాత్రలు అవసరమే. కానీ, మరికొద్ది నెలలు వేచి ఉందాం. కరోనా టీకాలు తీసుకోకుండా చేరుతున్న జన సమూహాలు.. మూడో దఫా విజృంభణకు సూపర్‌ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉంది’ అని ఐఎంఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాదిన్నర కాలంగా ఉన్న అనుభవాలను పరిశీలిస్తే.. భారీ సంఖ్యలో టీకాల పంపిణీ, కొవిడ్ నియమాళిని పాటించడం ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని తగ్గించగలమని వెల్లడించింది. మరో రెండు మూడు నెలలు జాగ్రత్త వహించాలని సూచించింది. అలాగే రెండో దఫా విజృంభణ సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేసింది. 

ఇటీవల పలు ఆధ్మాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు భారీగా గుమిగూడిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అందులో ఎవరు నిబంధనలను పాటించిన దాఖలాలు లేవు. దీనిపై నెట్టింట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. వీటిపై  ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. మూడో ముప్పునకు అవకాశం ఇవ్వొద్దని అభ్యర్థించింది. ఈ క్రమంలోనే ఐఎంఏ ప్రకటన విడుదలైంది. 

ఇదిలా ఉండగా.. మూడో ముప్పుపై నివేదికలు వస్తోన్న తరుణంలో అందుకు తగ్గట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. రెండోదశలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని ఆరోగ్య శాఖ నూతన మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. అత్యవసర ప్రతిస్పందన నిమిత్తం ఇటీవల కేంద్ర కేబినెట్‌ రూ. 23వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని చెప్పారు. చిన్నారుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సరైన సమయంలో స్పందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద బఫర్ స్టాక్‌ సిద్ధంగా ఉండేలా చూస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని