India Corona: ఊరట..మూడు లక్షల దిగువకు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా 3 లక్షలకు పైగా నమోదైన కేసులు.. తాజాగా 2,55,874కి తగ్గాయి.

Published : 25 Jan 2022 09:54 IST

కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొన్నాళ్లుగా 3 లక్షలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. తాజాగా 2,55,874కి తగ్గాయి. అంటే నిన్నటితో పోలిస్తే 16 శాతం మేర కొత్త కేసులు క్షీణించాయి. 20 శాతం దాటిన రోజువారీ పాజిటివిటీ రేటు.. 15.52 శాతానికి పడిపోయింది. 16 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క కర్ణాటకలోనే 46 వేల కేసులుండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అయితే కొవిడ్ మృతుల సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. నిన్న 614 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 171 మరణాలు కేరళలో చోటు చేసుకొన్నవే. ఈ రెండేళ్ల కాలంలో 3.97 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4.9 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

కేసుల కంటే రికవరీలే ఎక్కువ..

దేశంలో మూడో వేవ్‌కు ఒమిక్రాన్‌ ఆజ్యం పోయడంతో కొద్ది వారాలుగా కేసుల ఉద్ధృతి పెరిగింది. దాంతో రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్యే అధికంగా ఉండేది. కానీ, తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదుకావడం ఊరటనిస్తోంది. నిన్న 2,67,753 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.7 కోట్లు(93.15 శాతం)గా ఉన్నాయి. ప్రస్తుతం 22.3 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 5.62 శాతంగా ఉంది.

నిన్న 62 లక్షల మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 162 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న టీనేజర్లకు తొలిడోసు, ముప్పు పొంచి ఉన్న వర్గాలకు ప్రికాషనరీ డోసు ఇస్తుండటం.. థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించిందని నిన్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు బాగా తగ్గుముఖం పడతాయని అంచనా వేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని