2030 నాటికి.. ప్రపంచంలో అత్యధిక హృద్రోగ మరణాలు భారత్‌లోనే..!

2030 నాటికి ప్రపంచంలో అత్యధిక గుండె సంబంధిత మరణాలు నమోదవుతున్న దేశంగా భారత్‌ నిలువనుందని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ హెచ్చరించారు.

Published : 23 May 2022 01:45 IST

హృద్రోగ నిపుణులు హెచ్చరిక

బెంగళూరు: భారత్‌లో గత కొన్నేళ్లుగా హృద్రోగ మరణాలు క్రమంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇలా 2030 నాటికి ప్రపంచంలో అత్యధిక గుండె సంబంధిత మరణాలు నమోదవుతున్న దేశంగా భారత్‌ నిలువనుందని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ హెచ్చరించారు. అంతేకాకుండా, మొత్తంగా నమోదయ్యే మరణాల్లో ప్రతి నాలుగో మరణం కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌ (CVD)లతో ఉండనుందని అన్నారు. హెచ్‌ఏఎల్‌ మెడికాన్‌ 2022 పేరిట బెంగళూర్‌లో నిర్వహించిన ఓ వైద్య సదస్సులో డాక్టర్‌ మంజునాథ్‌ ఈవిధంగా మాట్లాడారు.

‘హృదయ సంబంధ సమస్యలు యువత, మధ్య వయసువారిలోనూ క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే విషయం. 2030 నాటికి ప్రపంచంలో హృదయ సంబంధిత మరణాలు నమోదయ్యే దేశాల్లో భారత్‌ ముందు స్థానంలో నిలువనుంది’ అని శ్రీ జయదేవ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియోవాస్కులర్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మంజునాథ్‌ పేర్కొన్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతోపాటు ఒత్తిడి తగ్గించుకునే కార్యక్రమాలతో సమగ్ర విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, ‘ఆరోగ్యకరమైన శ్రామికశక్తి’ అనే అంశంపై బెంగళూరులో రెండు రోజులపాటు జాతీయ వైద్య సదస్సు జరిగింది. ఇందులో హెచ్‌ఏఎల్‌తోపాటు జాతీయ స్థాయిలో వైద్య నిపుణులు పాల్గొన్నారు. హృద్రోగ ముప్పును ఎదుర్కొనే సరైన విధానంపై పరిశోధనలు, సూచనలు, సలహాలను అందించేందుకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని