Bribery case: కర్ణాటక భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్టు

భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్పను పోలీసులు అరెస్టు చేశారు. లంచం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

Published : 27 Mar 2023 22:19 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) భాజపా ఎమ్మెల్యే మాదల్‌ విరూపాక్షప్పను పోలీసులు అరెస్టు చేశారు.  కర్ణాటకలో ఓ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ తన కుమారుడు లోకాయుక్తకు చిక్కిన కేసులో విరూపాక్షప్ప ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.  ఓ టెండర్‌ ఇప్పిస్తానంటూ ఒక గుత్తేదారు నుంచి ఎమ్మెల్యే తనయుడు ప్రశాంత్‌ రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు అరెస్టు చేసిన వ్యవహారం కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. బెంగళూరు జలమండలిలో చీఫ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌.. ఓ టెండరు విషయంలో  రూ.81 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు లోకాయుక్త అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆకస్మికంగా దాడి చేసిన అధికారులు.. ఈ నెల తొలివారంలో ఎమ్మెల్యే తనయుడు ప్రశాంత్‌తో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపి భారీగా నగదుతో పాటు పెద్ద ఎత్తున భూములపై పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బంగారం, వెండి గుర్తించారు.  ఈ కేసులో ఎమ్మెల్యే విరూపాక్షప్పను ప్రధాన నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ..  అప్పటికే ఆయన హైకోర్టు నుంచి రూ.5లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడం ద్వారా ఈరోజు వరకు అరెస్టు నుంచి రక్షణ పొందుతూ వచ్చారు. తాజాగా ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్టు చేసి బెంగళూరుకు తరలిస్తున్నారు.  లంచం కేసులో తన కుమారుడు అరెస్టు కావడంతో కర్ణాటక సోప్స్‌ అండ్‌ డిటర్జెంట్స్‌ లిమిటెడ్‌ (కేఎస్‌డీఎల్‌) ఛైర్మన్‌ పదవికి విరూపాక్షప్ప ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని