Lakhimpur Kheri Violence: ‘లఖింపుర్‌ ఖేరి ఘటన.. ముందస్తు ప్రణాళికతో పన్నిన కుట్రే

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో రైతులు భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడటం ‘చర్యకు ప్రతిచర్య’ మాత్రమేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్‌ పేర్కొన్నారు...

Published : 09 Oct 2021 18:17 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో రైతులు భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడటం ‘చర్యకు ప్రతిచర్య’ మాత్రమేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్‌ పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని నిందితులుగా పరిగణించడం లేదని చెప్పారు. నిరసన తెలుపుతున్న రైతులపై వాహనాన్ని ఎక్కించినందుకుగానే వారు ఈ విధంగా స్పందించినట్లు శనివారం ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వివరించారు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) నాయకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో రైతులు, ఇతరులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనను ‘ముందస్తు ప్రణాళికతో పన్నిన కుట్ర’గా అభివర్ణిస్తూ.. దీనికి బాధ్యులైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్‌ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. నిందితులను రక్షించేందుకు యత్నిస్తున్న అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. లఖింపుర్‌ ఖేరి ఘటనకు నిరసనగా.. అక్టోబర్ 15న దసరా సందర్భంగా దిష్టిబొమ్మలను దహనం చేస్తామని ప్రకటించారు.

‘పేరుకు మాత్రమే సమన్లు..’

మరోవైపు ఈ హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా అనుమానిస్తున్న కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా.. విచారణ నిమిత్తం శనివారం ఉదయం పోలీసుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే. అయితే, విచారణ నిర్వహణ తీరుపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నిందితులను అరెస్టు చేయడానికి బదులు పుష్పగుచ్ఛాలు ఇస్తున్నట్లు ఆరోపించారు. ‘పేరుకు మాత్రమే సమన్లు.. వాస్తవానికి సమ్మాన్(గౌరవం) ఇచ్చారని’ ఎద్దేవా చేశారు. ఇటీవల రైతులను అణచివేశారు.. ఇప్పుడు చట్టాలను అణచివేసేందుకు యత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. యూపీ ప్రభుత్వం దోషులకు రక్షణ కల్పిస్తోందని ఆరోపిస్తూ.. అజయ్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లఖింపుర్‌లో గత ఆదివారం ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్‌ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లడం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని