Live-in relation: విడాకులు తీసుకోకుండా వేరొకరితో ఉండటం ‘సహజీవనం’ కాదు : హైకోర్టు

జీవిత భాగస్వామితో విడాకులు పొందకుండా వేరొక వ్యక్తితో కలిసి ఉండటం ‘సహజీవనం’ (Live-in Relationship)గా పరిగణించలేమని.. అది కామపూరిత, వ్యభిచార జీవితమేనని పంజాబ్‌-హరియాణా హైకోర్టు అభిప్రాయపడింది.

Published : 14 Nov 2023 20:52 IST

చండీగఢ్‌: జీవిత భాగస్వామితో విడాకులు పొందకుండా వేరొక వ్యక్తితో కలిసి ఉండటం ‘సహజీవనం’ (Live-in Relationship)గా పరిగణించలేమని పంజాబ్‌- హరియాణా హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తి కామపూరిత, వ్యభిచార జీవితం గడుపుతున్నట్లేనని అభిప్రాయపడింది. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్‌కు చెందిన ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం (High Court).. దాన్ని తోసిపుచ్చింది.

పంజాబ్‌కు చెందిన ఇద్దరు.. కొంతకాలంగా సహజీవనంలో ఉంటున్నారు. మహిళ అవివాహితురాలు కాగా పురుషుడికి పెళ్లయ్యింది. అతడికి ఇద్దరు పిల్లలు. మనస్పర్థల నేపథ్యంలో జీవిత భాగస్వామికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆ అవివాహిత మహిళ, పురుషుడు ఇటీవల అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. తాము సహజీవనంలో ఉన్నామని.. కానీ, అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ప్రాణాలకు రక్షణ, స్వేచ్ఛ కల్పించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ కుల్దీప్‌ తివారీతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారించింది.

కుక్కకాటు.. ఒక్కో ‘పంటి గాటు’కు రూ.10వేల పరిహారం!

‘మునుపటి బంధం నుంచి విడాకులు పొందకుండా పిటిషినర్‌ 1తో (అమ్మాయి) కామంతో కూడిన, వ్యభిచార జీవితాన్ని పిటిషనర్‌ 2 (పురుషుడు) గడుపుతున్నాడు. ఐపీసీ సెక్షన్‌ 494/495 ప్రకారం శిక్షార్హమైన నేరమే అవుతుంది. వివాహం దృష్టిలో అటువంటి సంబంధం ‘సహజీవనం’ (Live-in Relationship) కిందకు రాదు’ అని జస్టిస్‌ కుల్దీప్‌ తివారీ పేర్కొన్నారు. అంతేకాకుండా తమ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పే ఆధారాలేమీ చూపించలేదన్నారు. కేవలం వ్యభిచారం కేసులో విచారణను తప్పించుకోవడానికే ఈ పిటిషన్‌ వేసినట్లు కనిపిస్తోందని న్యాయమూర్తి వెల్లడించారు. అందుకే వారికి ఉపశమనం కల్పించేందుకు నిర్దిష్ట కారణాలు కనిపించలేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని