Sharad Pawar: మణిపుర్‌ అంశాన్ని పదే పదే లేవనెత్తడానికి అసలు కారణం అదే: పవార్‌

మణిపుర్‌ సమస్య కేవలం ఆ ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది కాదని ఎన్సీపీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ అన్నారు. సోమవారం ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు.

Published : 14 Aug 2023 16:26 IST

బారామతి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌తో నిన్న తాను భేటీ అయిన నేపథ్యంలో మహావికాస్‌ అఘాడీ కూటమిలో ఎలాంటి సమాచారలోపం లేదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌(Sharad Pawar) స్పష్టంచేశారు. మహారాష్ట్ర(Maharashtra)లో తమ కూటమి ఐక్యంగానే ఉందని.. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో విపక్ష కూటమి ‘ఇండియా’(I.N.D.I.A.) సమావేశం విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అజిత్‌ పవార్‌తో సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని కాంగ్రెస్‌, శివసేన(యూబీటీ) పవార్‌ను కోరవడంతో సోమవారం బారామతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు అంశాలకు సమాధానాలు ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మణిపుర్‌ అంశాన్ని విపక్ష ‘ఇండియా’ కూటమి పదే పదే లేవనెత్తడానికి గల కారణాలను వివరించారు. 

మణిపుర్‌ అంశం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదు..

మణిపుర్‌ సమస్య(Manipur Issue) కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది కాదని పవార్‌ (Sharad Pawar) అన్నారు. కొన్ని ఈశాన్య ప్రాంతాలు చైనా(China) సరిహద్దు వెంబడి ఉన్నాయని.. మణిపుర్‌ దాటి ఒక దేశమే ఉందన్నారు.  సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎదుర్కొనే కష్టాలపై ప్రభుత్వం దృష్టిసారించకపోతే.. అది మన దేశానికి అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకే పార్లమెంట్‌లో మణిపుర్‌ అంశాన్ని విపక్ష పార్టీలు పదే పదే లేవనెత్తేందుకు ప్రయత్నించాయని, చర్చకు డిమాండ్‌ చేశాయని పవార్‌ అన్నారు.  కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక నిర్దిష్ట సెక్షన్ కింద చర్చించే ఉద్దేశంతో లేకపోవడంతో ఆ డిమాండ్‌ నెరవేరలేదని చెప్పారు.  ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై  చర్చకు సమాధానంగా రెండు గంటలకు పైగా ప్రసంగించినా మణిపుర్‌ అంశంపై మాత్రం పరిమితంగానే మాట్లాడారన్నారు. ఆయన ప్రసంగం మణిపుర్‌ ప్రజలకు కొంత భరోసాను కల్పించేలా లేదని పవార్‌ అభిప్రాయపడ్డారు.  ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్‌ను భాజపా నిందిస్తుండటంపై అడిగిన ప్రశ్నకు పవార్‌ దీటుగా స్పందించారు. గత తొమ్మిదేళ్లలో భాజపా ఏం చేసిందని 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ చేసినదాన్ని ప్రశ్నించడానికి అంటూ నిలదీశారు.  ఠానేలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24గంటల వ్యవధిలో 18మంది మృతిచెందడంపై పవార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం ఏక్‌నాథ్‌ శిందే సొంత నగరమైన ఠానేలోనే ఈ ఘటన జరిగిందన్న ఆయన.. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. 

చార్‌ధామ్‌ యాత్ర రెండు రోజుల పాటు నిలిపివేత.. 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

అదే అడిగి మరింత కన్ఫ్యూజన్‌ సృష్టించొద్దు..

అజిత్‌ పవార్‌(Ajit pawar)తో తాను సమావేశమైన విషయంలో మహారాష్ట్రలో తమ భాగస్వామ్య పక్షాలు (కాంగ్రెస్‌, శివసేన-యూబీటీ) మధ్య ఎలాంటి గందరగోళం లేదని శరద్‌ పవార్‌ స్పష్టంచేశారు.  మళ్లీ అదే ప్రశ్న అడిగి మరింత కన్ఫ్యూజన్‌ సృష్టించవద్దని మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.  ‘‘నేను, ఉద్ధవ్‌ ఠాక్రే, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే ఇండియా కూటమి సమావేశం ముంబయిలో నిర్వహించే బాధ్యతను తీసుకున్నాం’’ అన్నారు. ఈ భేటీ ఓ లగ్జరీ హోటల్‌లో జరుగుతుందని చెప్పారు. మరోవైపు, అజిత్ పవార్‌, శరద్ పవార్‌ల మధ్య తరచూ జరుగుతున్న సమావేశాలపై అసంతృప్తిని వ్యక్తంచేస్తూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో రాసిన కథనంపై ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. 

జయంత్‌ విషయంలోనూ అలాంటి ప్రయత్నమే జరుగుతోంది..

ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ భాజపాతో చేతులు కలిపే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై నిన్న పుణెలో అజిత్‌ పవార్‌తో సమావేశంలో చర్చించారా? అని అడిగిన ప్రశ్నకు శరద్‌ పవార్‌ స్పందించారు. అలాంటి చర్చలేమీ జరగలేదని స్పష్టంచేశారు. ‘జయంత్‌ పాటిల్‌ సోదరుడికి ఈడీ నుంచి నోటీసులు అందినట్టు విన్నా. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నా సహచరులకు కొందరికి కూడా ఇలాగే నోటీసులు వచ్చాయి. దీంతో వారు భాజపాతో వెళ్లారు. జయంత్‌ పాటిల్‌ విషయంలో అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. అయితే, సైద్ధాంతికంగా ఆయన వైఖరి స్పష్టంగా ఉందని అనుకుంటున్నా’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని